Advertisement

మెగాస్టార్ శానిటైజర్‌..’సాని’ప‌త్రిక‌ల వికృత రాత‌లు

Posted : March 21, 2020 at 12:47 pm IST by ManaTeluguMovies

భారత్‌తో సహా ప్రపంచాన్ని ‘కరోనా వైరస్’ హడలెత్తిస్తున్న నేపథ్యంలో ప్రజల దైనందిన జీవనంలో అనేక మార్పులు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి.

పరిచయస్తులు, స్నేహితులు ఎదురుపడినపుడు అలవాటుగా చేయి చాచి ‘షేక్ హ్యాండ్’ ఇవ్వడం మంచిది కాదని, ఒక వేళ చేతులు కలిపితే… వెంటనే సబ్బుతోనో, శానిటైజర్‌తోనో చేతులు కడుక్కోవాలని హెచ్చరిస్తున్నారు. కొంతమంది ఈ సూచనను కచ్చితంగా ఆచరిస్తున్నారు.

చేతులు శుభ్రపర్చుకోవడానికి ప్రతిసారి వాష్ బేసిన్ వద్దకు వెళ్లడం కుదరదు కనుక ‘శానిటైజర్’ను దగ్గరుంచుకుంటున్నారు. అంతకు ముందెప్పుడూ శానిటైజర్లను వాడని వారు కూడా ఇప్పుడు శానిటైజర్ ఉపయోగిస్తున్నారు. దీన్ని అందరం ఆహ్వానించాల్సిందే! కరోనా వైరస్ తొలిగే వరకు వ్యక్తిగత పరిశుభ్రతకు అందరూ ప్రాధాన్యం ఇవ్వాలి.

అయితే మెగాస్టార్‌కు శానిటైజ‌ర్‌కు సంబంధం ఏమిటి? ఇప్పుడు ఆ ప్రస్తావన దేనికి? అనే సందేహాలు చాలా మందికి వస్తాయి. ఇప్పుడు ఆ విషయానికి వస్తాను.

2008 ఆగస్టులో మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ ఏర్పాటు చేశాక… ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ప్రత్యేక వాహనాలు రూపొందించారు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించేందుకు వాటిని ఉపయోగించారు. ఆ వాహనాల్లో లోపలి నుంచి పైకి వెళ్లడానికి నిచ్చెన మెట్లు… వాహనం పైభాగాన లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఉండేవి.

ప్రతి ఊరూ, పట్టణం రాగానే చిరంజీవి గారు వాహనం పైకెక్కి ప్రసంగించేవారు. ఎక్కడకు వెళ్లినా ఆయన్ను చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. అభిమానుల సందడికి హద్దే ఉండేది కాదు. అన్నిచోట్లా స్థానిక నేతలు వాహనం వద్దకు వచ్చి మెగాస్టార్‌తో మాట్లాడేవారు. వారందరితో ఆయన కరచాలనాలు, కలిసి ఫొటోలు దిగడం, ఆత్మీయంగా హత్తుకోవడం సర్వ సాధారణంగా ఉండేవి. అభిమానులైతే గజమాలలు వేసే వారు. కొందరు దగ్గరకు రాలేక, దూరం నుంచే పూలదండల్ని విసరేవారు. పూల వర్షం కురిపించే వారు. ఇలా ప్రతి ఊరిలో కోలాహలమే! ప్రతి రోజు ఆయన పర్యటనలో అటువంటివి కనీసం 50 చోట్ల జరిగేవి.

చిరంజీవి గారి వాహనంలో ఆయనకు పొలిటికల్ ఇన్‌పుట్స్ ఇచ్చేందుకు నేను, నాతో పాటు ఆయన స్నేహితుడు, అభిమాని అయిన కోనేరు కుమార్ ఉండేవాళ్లం. (అమెరికాలో సెటిల్ అయిన కోనేరు కుమార్ చిరంజీవి గారికి వ్యక్తిగతంగా అసిస్ట్ చేయడానికి ప్రత్యేకంగా వచ్చారు). కొన్ని పర్యటనల్లో మాతో పాటు నేషనల్ మీడియాను కోఆర్డినేట్ చేసిన ఆకెళ్ల రాజ్ కుమార్ కూడా ఉన్నారు. పర్యటనకు బయలుదేరే ముందు ప్రతి రోజూ ఉదయం మీడియాతో కొద్దిసేపు ఇంటరాక్ట్ అయ్యేవారు (మీడియా ప్రతినిధులు సైతం ఆయనతో ఫొటోలు దిగేవారు. షేక్ హ్యాండ్లు ఇచ్చేవారు. ఎవర్నీ నొప్పించే మనస్త‌త్వం లేని చిరంజీవి గారు ఓపిగ్గా అందరితో ఫొటోలు దిగి వారిని సంతృప్తి పర్చేవారు). ఆ తర్వాత వాహనం ఎక్కేవారు. వాహనం ఎక్కిన తర్వాత కూడా పదుల సంఖ్యలో ముఖ్య నేతలు ఆయనను కలిసేవారు. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఆయనతో చేతులు కలపాలని భావించేవారు. చేతులు కలిపేవారు. గంటల వ్యవధిలోనే ఆయన అరచేతులు మట్టి పట్టేసినట్టు అయిపోయేవి.

ప్రసంగాల విరామంలో చిరంజీవి గారు వాహనంలోపలికి వచ్చేవారు. ఆయన కొద్దిసేపు రిలాక్సయ్యాక… కోనేరు కుమార్ ఆయనకు ‘శానిటైజర్’ అందించేవారు. దానితో ఆయన చేతులు శుభ్రపర్చుకునే వారు. మరో ఊరు రాగానే మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయ్యేది. వేలాది మంది అభిమానులు, ప్రజలు, నేతలతో కరచాలనాలు, ఆత్మీయ పలకరింపులు, భుజాలపై చేయి వేసి ఫొటోలు దిగటం జరిగేది. గంట వ్యవధిలోనే మళ్లీ ఆయన అరచేతులు మట్టి పట్టేసిన‌ట్టు అయ్యేవి.

వాహనంలో వాష్ బేసిన్ ఉన్నప్పటికీ ప్రతిసారి అక్కడి కెళ్లి చేతులు కడుక్కోవడం కష్టం కనుక కుమార్ అందించే శానిటైజర్ నే చిరంజీవి గారు ఉపయోగించేవారు. అప్పట్లో చేతులు శుభ్రపర్చుకోవడానికి ‘శానిటైజర్’ని ఉపయోగించడం తక్కువ. కొంతమంది నాయకులు కూడా చిరంజీవి గారిని “అది ఏమిటి సార్” అని ఆసక్తిగా అడిగేవాళ్లు. “చేతుల్ని కడుక్కొనే వెసులు బాటు లేని సందర్భాలలో ‘శానిటైజర్’ను ఉపయోగించడం మంచిది” అని చాలా మందికి చెప్పేవారు.

పర్యటనలో ఉండగానే ఓ రోజు ప్రముఖ దినపత్రికలో ఓ బాక్స్ ఐటమ్ వచ్చింది. అందులో చిరంజీవి శానిటైజర్‌తో చేతులు శుభ్రపర్చుకొంటున్న ఫొటో ఉంది.

“అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు కడుక్కొన్న చిరంజీవి” అనే హెడ్డింగ్ తో వార్త వేశారు. ఆ వార్త సారాంశం ఏమిటంటే… షేక్ హ్యాండ్ ఇచ్చిన అభిమాని సామాన్యుడు కనుక… అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చిన చిరంజీవి… తన చేయి మైలపడినట్లు భావించి… శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకొన్నారు… అనే అర్థం వచ్చేటట్టు రాశారు. చిరంజీవి శానిటైజర్ తో చేతులు తుడుచుకొంటున్నప్పుడు తీసిన ఫొటోకు ఓ కథ వండి బాక్స్‌ కట్టి వేశారు. ఆ సమయంలో చిరంజీవి ఇమేజ్ ను దెబ్బ తీయడానికి పనిగట్టుకొని కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నించాయి. అందులో భాగంగానే… శానిటైజర్ తో చేతులు శుభ్రపర్చుకున్న పొటోకు వార్తను సృష్టించారు.

దారుణం ఏమిటంటే, ఆ వార్తను ఆధారం చేసుకొని రెండు ప్రధాన పార్టీలు ప్రెస్ మీట్లు పెట్టి చిరంజీవిని విమర్శించాయి. కొన్ని చానెళ్లు ఈ వార్తకు మరింత మసాలా జోడించి “అభిమానులంటే అంత హీనమా” అంటూ స్టోరీలు ప్రసారం చేశాయి.

శుభ్రత, భద్రత, ఆరోగ్యానికి ప్రాముఖ్యత

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, భద్రత, ఆరోగ్యానికి ప్రాముఖ్యం ఇవ్వాలని చిరంజీవి అందరికీ చెబుతుంటారు. వాటిని ఆయన స్వయంగా ఆచరిస్తుంటారు. ఆరోగ్య అంశాలకు సంబంధించి ఆయనకు అపారమైన పరిజ్ఞానం ఉంది. ఆ సబ్జెక్టును నిరంతరం ఆయన తన ట్యాబ్‌లో సెర్చ్ చేస్తూ అధ్యయనం చేస్తుంటారు. తన మిత్రులైన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గాని, మరికొంతమంది డాక్టర్లు వచ్చినా… ఎక్కువ సమయం హెల్త్ సంబంధిత అంశాలపై చర్చిస్తుంటారు. ఆరోగ్యంపై ఆయనకున్న పరిజ్ఞానం ఎంతంటే కొందర్ని గమనించి వారికున్న ఆరోగ్య సమస్యల్ని చెబుతుంటారు.

ఒకసారి చిరంజీవిని కలవడానికి నరసాపురంలో ఆయనతో పాటు చదువుకున్న బాబులు, నాయుడు అనే తన చిన్ననాటి మిత్రులు ఇంటికొచ్చారు. కాఫీలు తాగడం ముగిసాక… వాళ్లల్లో ఏదో తేడా కనిసిస్తోందని గ్రహించిన చిరంజీవి గారు… “మీరు వెంటనే అపోలోకు వెళ్లి హార్ట్ టెస్టు చేయించుకొండి.. నేను ఫోన్ చేయిస్తాను” అనే చెప్పేసరికి ఆ ఇద్దరు నిర్ఘాంతపోయారు. ఏదో చూసి పోదాం… అనుకుంటే… ఈయన హాస్పిటల్‌కు వెళ్లి టెస్టు చేయించుకోమంటారేమిటి? అనే అభిప్రాయంతో… “అబ్బే…మాకేమి ఇబ్బంది లేదు. మరోసారి వెళతాం” అని వారు నసగుతూ చెప్పారు. కానీ తన సిక్స్‌ సెన్స్ ఏదో చెబుతున్నట్లు “లేదు… లేదు… మీరు వెళ్లండి లేటు కాకుండా నేను చెబుతాను…” అంటూ ఆయన కారిచ్చి వారిద్దర్నీ అప్పటికప్పుడు అపోలోకు పంపించారు.

వారిద్దరికీ వైద్య ప‌రీక్ష‌లు జరిగాయి. రిపోర్టులు చూసిన డాక్టర్లు “బాబులుకు 24 గంటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని.. హార్ట్ లో 3 వాల్వ్స్ బ్లాక్స్ అయ్యాయని చెప్పారు. నాయుడుకు ఆపరేషన్ అవసరమని… కాకుంటే కొద్ది రోజులు ఆగవచ్చని తేల్చారు. రిపోర్టులు చూసిన బాబులుకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆపరేషన్ చేయించుకోవడానికి ఆయన అప్పటికప్పుడు సిద్ధంగా లేడు. అది గ్రహించిన చిరంజీవిగారు ఆయనకు ధైర్యం చెప్పి “అన్నీనేను చూసుకొంటా… భయపడకు” అంటూ గంటల వ్యవధిలో ఆయనకు ఆపరేషన్ చేయించారు.

కొద్ది రోజుల తర్వాత మరో మిత్రుడు నాయుడుకు ఆపరేషన్ జరిగింది. యాధృచ్ఛికంగా చిరంజీవిగారిని ఆ రోజు తాము కలవక పోతే భూమ్మీద ఉండేవాళ్లం కాదు.. అని వారిద్దరూ ఇప్పటికీ అంటుంటారు. దాదాపు రెండేళ్ల క్రితం మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ లో చేరినపుడు.. ఆయన కండీషన్ చాలా క్రిటికల్ ఉందని తెలియగానే.. నిమిషాల వ్యవధిలో ఆయనను ఆపోలోకు షిఫ్ట్ చేయించి… స్వయంగా చిరంజీవిగారే డాక్టర్లతో మాట్లాడి… పలువురు స్పెషలిస్ట్లను రప్పించి యుద్ధప్రాతిపదికన ట్రీట్మెంట్ చేయించారు. దాదాపు నెలరోజుల తర్వాత కొత్తపల్లి సుబ్బారాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్లారు.

చిరంజీవి గారు… తన దగ్గర పనిచేసే సిబ్బంది ఆరోగ్యం పట్ల ఎంతో కన్సర్న్ చూపిస్తారు. తన దగ్గరున్న దాదాపు 50 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి తానే ప్రతియేటా ప్రీమియం కడుతుంటారు. ఒకసారి నాతో ఏదో అంశం గురించి మాట్లాడుతూ సడెన్ గా “రేపు ఓసారి అపోలోకు వెళ్లి ‘డి’ విటమిన్‌ టెస్ట్ చేయించుకోండి” అన్నారు. నేను అశ్చర్యపోయాను. ప్రత్యేకంగా ‘డి’ విటమిన్ టెస్ట్ చేస్తారన్న విషయం నాకు అప్పటి వరకు తెలియదు.

కారు ప్రయాణాల్లో సీటుబెల్ట్ పెట్టుకోవడం చిరంజీవి గారికి అలవాటు. సీటుబెల్ట్ లేకుండా ఎవరైనా తన కంట పడితే… వారిని సున్నితంగా మందలిస్తుంటారు. చిరంజీవి గారు పదేపదే కారు సీటుబెల్ట్ పెట్టుకోమని చెప్పినందున… యాక్స్ డెంట్లు అయినా సురక్షితంగా బయటపడ్డామని… సీటుబెల్ట్ పెట్టుకోవడం అలవాటు చేసుకున్న‌ ఇద్దరు, ముగ్గురు సినీ యాక్టర్లు బాహాటంగా తమ కృతజ్ఞతను వ్యక్తం చేసిన విషయం చాలా మందికి తెలిసుండొచ్చు.

అభిమాని షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు శానిటైజర్తో చేతులు కడుక్కొన్నారనే వార్త ప్రచురితమైన రోజు “రిజాయిండర్ ఇద్దాం సార్” అన్నాను నేను చిరంజీవిగారితో. ఆయన నవ్వి “అక్కర్లేదు..రాసుకోనివ్వండి.. ఏదో ఒక రోజు సత్యం బయటకొస్తుంది” అన్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు కరోనా వైరస్ భయంతో… చాలా మంది శానిటైజర్‌ను ఉపయోగిస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత శానిటైజర్‌ను ఉపయోగించడం నేరమూ, పాపమూ కాదని, అది కేవలం వ్యక్తిగత శుభ్రతకు, ముందస్తు జాగ్రత్తకు వాడేదేనని తెలుసుకొంటున్నారు.

చిరంజీవిగారితో నేను 6 ఏళ్లు ట్రావెల్ చేశాను. ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గర్నుంచి పరిశీలించే అవకాశం కలిగింది. తనని కించపర్చి అనందం పొందే వారిని కూడా ఊదారంగా వదిలి వేసే అరుదైన మనస్త‌త్వం ఆయనది!


Advertisement

Recent Random Post:

Dhee Celebrity Special Latest Promo – #DCS – 24th April 2024 – Pranitha Subhash,Nandu,Hyper Aadi

Posted : April 23, 2024 at 5:48 pm IST by ManaTeluguMovies

Dhee Celebrity Special Latest Promo – #DCS – 24th April 2024 – Pranitha Subhash,Nandu,Hyper Aadi

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement