Advertisement

ఇలా అయితే ఎలా ‘పెద్దాయినా’?

Posted : August 28, 2020 at 10:24 pm IST by ManaTeluguMovies

దాసరి నారాయణరావు, ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద. ఇప్పటికీ జనం అలాగే ఆయనను తలుచుకుంటారు. చిన్న అయినా పెద్ద అయినా నేరుగా ఆయన ఇంటి తలుపు తట్టే అవకాశం వుండేది. సమస్య చెప్పుకునే సౌలభ్యం వుండేది. ఇరువర్గాలను పిలిచి కూర్చోపెట్టే వీలు వుండేది. ఇలా కనీసం ఒక ఊరట అనేది లభించేది. న్యాయం దొరుకుతుందా? దొరకదా? అన్నది తరువాత, కనీసం ముందు ఓ ప్రయత్నం అనేది వుండేది.

దాసరి తరువాత ఆ స్థానంలో వుండాలని మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నం. నిజానికి ఆయన మెగాస్టార్. టాలీవుడ్ లో ఆయనది తిరుగులేని ఆధిపత్యం. మెగా క్యాంప్ అనే బలమైన సామ్రాజ్యం. ఇవన్నీ వున్నాయి. కానీ ‘పెద్దాయిన’ అనే ప్లేస్ ను రీప్లేస్ చేయలేకపోతున్నారు.

కరోనా టైమ్ లో కొంత ట్రయ్ చేసారు. బాలకృష్ణ లాంటి వారు మెగాస్టార్ చేస్తున్న తప్పులు ఎత్తి చూపేసరికి సైలంట్ అయిపోయారు. ‘అంతమంది వెళ్దాం..ఇంత మంది వెళ్దాం జగన్ దగ్గరకు అని చెప్పి, లాస్ట్ మినిట్ లో అంతమందిని రావద్దన్నారు, అని మాట మార్చి, కొద్దిమందిని మాత్రం తీసుకుని వెళ్లిపోయారు’ అనే విమర్శ ఇండస్ట్రీ వర్గాల్లో వుంది. ఇది పైకి బహిరంగంగా చెప్పకపోవచ్చు. కానీ ఇండస్ట్రీలో చాలా మంది నేనుగా మీడియాతోనే షేర్ చేసుకున్న విషయం ఇది.

ఆ సంగతి అలా వుంచితే ఇప్పుడు ఆయన నటిస్తున్న సినిమా మీదే వివాదం చెలరేగింది. రాజేష్ అనే అసిస్టెంట్ డైరక్టర్ తన ఆవేదన మీడియా ముందు వ్యక్తం చేసారు. ‘దాసరి వుంటే న్యాయం జరిగేది., మెగాస్టార్ లాంటి వాళ్ల దగ్గరకు తమలాంటి వాళ్లకు అంత సులవుగా ఎంట్రీ దొరకదు’ అని బహిరంగంగా వాపోయారు.

అలాంటపుడు మెగాస్టార్ చేయాల్సింది ఏమిటి? తక్షణం ఆ అసిస్టెంట్ డైరక్టర్ ను పిలిపించి, ఏం జరిగిందో, కథేమిటో తెలుసుకోవాలి కదా? అసలు కథ ఆయనకు ఎలాగూ తెలుస్తుంది. ఈ కథ, ‘బాబూ, ఇదీ అది ఒకటి కాదు, నా మాట నమ్ము’ అని చెప్పి పంపేయచ్చు కదా. మెగాస్టార్ అంతటి మనిషి అలా చెపితే ఇక మాట్లాడడు కదా.

తన బ్యానర్ సమర్పిస్తున్న సినిమా, తను హీరోగా, తన కొడుకు మరో హీరోగా నటిస్తున్న సినిమా. అలాంటి సినిమా మీద ఆరోపణ వచ్చినపుడు ఆయన స్పందించడం సమంజసంగా వుంటుంది. అలా కాకపోయినా, పెద్ద మనిషి తరహాగా ఓ బడుగు ఆస్పిరెంట్ డైరక్టర్ ను దగ్గరకు తీస్తే ఆయన కీర్తి మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. కచ్చితంగా దాసరి ప్లేస్ లోకి వెళ్లాలి అంటే ఇలా ఆయన తలుపులు, సామాన్యులకు కూడా తెరవాలి.

ఎవరో చిన్న నటుడు అమెరికాలో చిరు పాటకు డ్యాన్స్ చేస్తే వెంటనే స్పందించిన చిరు, ఓ చిన్న టెక్నీషియన్ బాధకు మాత్రం స్పందించరా? ఇలా అయితే టాలీవుడ్ పెద్దాయిన ప్లేస్ లోకి చిరు ఎలా రాగలుగుతారు?


Advertisement

Recent Random Post:
Advertisement