సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు ఏడాది కాలంగా సంచలనంగా మారుతోన్న సంగతి తెలిసిందే. వివిధ వేదికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగానూ కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఇటీవలే ‘లాల్ సలామ్’ ఆడియలో లాంచ్ లో హిందూ మతం, సనాతన ధర్మం, భగవద్గీత మొదలైన అంశాలపై తన అభిప్రాయాల్ని పంచుకునే ప్రయత్నం చేసారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని వర్గాల్లో వివాదా స్పదంగానూ మారాయి.
రజనీ వ్యాఖ్యల్ని వక్రీకరించి కోలీవుడ్ మీడియా ప్రచారం చేసినట్లు తెరపైకి వస్తోంది. అయితే ఇదంతా సంచలనం కాదుగానీ…గతంలో ‘జైలర్’ ఈవెంట్‌లో ఆయన ప్రసంగం మాత్రం ఇప్పటికీ ఓ స్టార్ హీరో అభిమానుల్ని బాగా హర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఈవెంట్ లో రజనీ కాంత్… మరో స్టార్ హీరో విజయ్ ని టార్గెట్ చేసి వ్యాఖ్యానించినట్లు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ సాగింది. ‘జైలర్’ లో హుకుమ్ పాట..ఆ సాహిత్యం వివాదాస్పదం అవ్వడం గురించి తెలిసిందే. ఆ ప్రసంగంలో రజనీకాంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ఓ కథ రూపంలో చెప్పే ప్రయత్నం చేసారు.
‘పక్షుల ప్రపంచంలో కాకి ప్రతి ఒక్కరినీ కలవరపెడుతుంది. అయితే, ఒక డేగ నిశ్చలంగా ఉంటుంది. ఒక కాకి డేగను బాధపెట్టినప్పుడు, డేగ స్పందించదు. ఇది కేవలం తదుపరి దశకు వెళుతుంది. ఈ సారూప్య త డేగ వంటి ఉన్నతమైన శక్తి కాకి చర్యలతో బాధపడదు అనే ఆలోచనను వ్యక్తపరిచింది. ఈ వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేసారు. రజనీని టార్గెట్ చేసి మరీ ఈ తంతకు తెర తీసారు. తనపై వచ్చిన ఈ రకమైన విమర్శలపై రజనీకాంత్ ‘లాల్ సలామ్’ ఈవెంట్ లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
‘చాలా మంది నా ‘కాకి మరియు డేగ’ కథను విజయ్‌పై దాడిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రజలు దీనిని పోటీగా చూడటం నాకు బాధ కలిగించింది. మేమిద్దరం మా స్వంత మార్గాల్లో ఎంతో సంతోషంగా ముందుకెళ్తున్నాం. విజయ్ చిన్నప్పటి నుంచి తెలుసు. పెద్ద స్టార్‌గా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చి సామాజిక సంక్షేమంలో నిమగ్నమవుతున్నాడు. నేను ఎల్లప్పుడూ అతనికి మద్దతుగా ఉంటాను. దయచేసి ఇలాంటి అపా ర్థాలు మళ్లీ తీసుకురావద్దు’ అంటూ ప్రేక్షకాభిమానుల్ని కోరారు.