తాజాగా వివాదాస్పద నటి ఖుష్బూ తెరమీదకు వచ్చారు. కరోనాపై ఎంతో విలువైన సందేశాన్ని ఆమె ఇచ్చారు. దేవుళ్లు, భక్తి పేరుతో ఇంకా మూఢ విశ్వాసాలతో ఉంటే ఏమవుతుందో ఆమె పరోక్షంగా హెచ్చరించారు. ఈ విపత్కర సమయంలో ఎలా ఉండాలో ఆమె సూటిగా, స్పష్టంగా తనదైన శైలిలో చెప్పారు.
కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు మందులేదని, కేవలం ప్రభుత్వాలు సూచిస్తున్నట్టు ఇంటికే పరిమితమై దానికి దూరంగా ఉండటమే ఏకైక మార్గమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తమకు వచ్చిన కష్టంగా భావించి, దాని నుంచి బయటపడేందుకు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆమె వివరించారు. అంతే తప్ప, ఇలాంటి సమయంలో కూడా దేవుడు, దెయ్యం, పూజలు అంటూ ఇంటి బయటికి వస్తే మాత్రం కరోనా కబళిస్తుందని ఆమె హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఖుష్బూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాస్తా కఠినంగా ఉన్నా…ఈ విపత్కర సమయంలో ఖుష్బూ ట్విటర్ వేదిక చేసిన సూచనలు, హెచ్చరికలు సమంజసమైనవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘దేవుళ్లంటే అందరికీ ఇష్టమే. కానీ ఏ దేవుళ్లూ.. తనని కొలిచే భక్తులని దేవాలయాలకి, చర్చలకి, మసీదులకి వచ్చి ప్రార్థించమని అడగరు. అందులోనూ ఇలాంటి కష్టకాలంలో. బాధ్యతాయుతమైన భక్తులుగా ప్రవర్తించే వారిని ఇలాంటి సంక్షోభాల నుంచి దేవుళ్లు కాపాడుతారు. మనందరం ఐక్యంగా కరోనాపై ఫైట్ చేద్దాం. దాన్ని ఈ లోకం నుంచి తరిమికొడదాం. ఒకరికి ఒకరు తగినంత దూరం పాటిద్దాం. దయచేసి మరోసారి విన్నవించుకుంటున్నా. అందరం మన దేవుళ్లను ఇంటి నుంచే ప్రార్థిద్దాం’ అని ఖుష్బూ తన ట్వీట్‌లో వేడుకున్నారు.