సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గత చిత్రం సైంధవ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచింది. వెంకీ కెరీర్ లో కీలకంగా చెప్పుకొచ్చిన సైంధవ్ సినిమాతో ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. అయినా కూడా వెంకటేష్ తదుపరి సినిమా ఏంటి అంటూ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల వెంకటేష్ హీరోగా నటించబోతున్న తదుపరి సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ముగింపు దశకు వచ్చాయట. తాజాగా ఈ సినిమా గురించి సినిమా ఇండస్ట్రీ నుంచి ఆసక్తికర అప్డేట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది.
ఏప్రిల్ 9వ తారీకున ఉగాది సందర్భంగా వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో మూవీ కి క్లాప్ పడబోతుంది. సినీ ప్రముఖులను ఆహ్వానించే పనిలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయట.
అనిల్ రావిపూడి సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి వెంకటేష్ తో చేయబోతున్న సినిమా విడుదల ఉండే అవకాశం ఉందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి కాంబో మూవీ కొత్త కాన్సెప్ట్ తో వినోదాత్మకంగా ఉంటుందట.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వెంకటేష్ కు ఈ సినిమా అత్యంత కీలకం. సైంధవ్ ఫ్లాప్ నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
భగవంత్ కేసరి సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ఫ్లాప్ లను చవిచూడలేదు. కనుక వెంకటేష్ ఫ్యాన్స్ కి కచ్చితంగా మంచి విజయాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా ధీమాతో ఉన్నారు.