ప్రభాస్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. హీరోయిన్ల నుంచి హీరోలు, దర్శకుల వరకూ అతడితో పనిచేసిన ప్రతీ ఒక్కరు డార్లింగ్ ప్రేమలో పడిపోతారు. అతడితో కలిసి మళ్లీ మళ్లీ కలిసి పనిచేయాలని కోరుకుంటారు. అతడి సింప్లిసిటీ..డౌన్ టూ ఎర్త్ క్వాలిటీ…కల్మషం లేని మనస్తత్వాన్ని అందరూ ఇష్టపడతారు. దేశంలో అతడో పెద్ద స్టార్. వందల కోట్ల రూపాయలు పారితోషికం అందుకునే నటుడు. కానీ వాటన్నింటికంటే అతడు తనని తాను ఓ సాధారణ మనిషిగా భావిస్తాడు.
ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే అంత పెద్ద స్టార్ అయ్యాడు. అంతమంది అభిమానం పొందుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో `రాజాసాబ్` చిత్రం ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వహాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆన్ సెట్స్ లో ప్రభాస్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని అందర్నీ సర్ ప్రైజ్ చేసారు. `తదుపరి జన్మ అంటూ ఉంటే అక్కడ నాకు ప్రభాస్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటున్నా.
అతడు ఎంతో డౌన్ టూ ఎర్త్. పెద్దలంటే ఎంతో గౌరవంతో ఉంటారు. అతడులాంటి వ్యక్తిని ఇంతవరకూ నా కెరీర్ లో చూడలేదు. ఎదురు కాలేదు. అతడు ఓ పెద్ద స్టార్. కానీ షూట్ పూర్తయిన తర్వాత అందరితో ఎంతో సరదాగా ఉంటారు. సెట్స్ నుంచి వెళ్లేటప్పుడు అందరికీ విడ్కోలు చెబుతారు. సెట్స్ లో ఎవరైనా ఆకలితో ఉన్నారు? అని తెలిస్తే వెంటనే ఇంటికి ఫోన్ చేసి నలభై మందికి భోజనం రెడీ చేయమని చెబుతారు.
ఆ భోజనం వెంటనే రావాలని ఆర్డర్ వేస్తారు. ప్రభాస్ స్వీట్ హార్ట్. నేటి జనరేషన్ కి అతడు ఆదర్శం. పెద్దల పట్ల ఎలా నడుచుకోవాలో? అన్ని తెలిసిన వ్యక్తి. యువకులు అతన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి` అని అన్నారు. జరీనా వహాబ్ ఎన్టీఆర్ హీరోగా నటించిన `దేవర`లోనూ నటించిన సంగతి తెలిసిందే.