సత్యదేవ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన జీబ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో చిరు తన స్పీచ్ తో ఫ్యాన్స్ అందరినీ అలరించారు. జీబ్రా ఈవెంట్ అంతా మెగా ఫ్యాన్స్ హంగామాతో నిండిపోయింది. ఈవెంట్ లో భాగంగా చిరంజీవి మీద తన అభిమానాన్ని డ్యాన్స్ ఇంకా స్పీచ్ ల రూపంలో చూపించాడు సత్యదేవ్. ఆ తర్వాత మైక్ అందుకున్న చిరంజీవి సత్యదేవ్ గురించి జీబ్రా సినిమా గురించి మాట్లాడారు.
కోవిడ్ పాండమిక్ టైం లో అన్ని ఇండస్ట్రీలతో పాటుగా సినిమా పరిశ్రమ ఏమవుతుందో అన్న భయం కలిగింది. ఆ టైం లో ప్రేక్షకులు అంతా OTTలకు అలవాటు పడ్డారు. మళ్లీ థియేటర్ కు వచ్చి సినిమాలు చూస్తారా అన్న డౌట్ ఉంది. కానీ మీరు మంచి సినిమాలు తీస్తే మేం ఆదరిస్తామని ప్రూవ్ చేస్తున్నారు ప్రేక్షకులు. సినిమా ఆడకపోతే అది ప్రేక్షకుల తప్పు కాదు అది పూర్తిగా మన తప్పే అన్నారు చిరంజీవి. మంచి కంటెంట్ ఉన్న సినిమా అందిస్తే తప్పకుండా ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారని అన్నారు.
ఐతే చిరంజీవి మాట్లాడుతుండగా మధ్యలో ఒక అభిమాని చిరంజీవి గారు నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్ అని అన్నాడు. వెంటనే వాల్తేరు వీరయ్య డిక్షన్ లో అయితే ఈ కుర్రాడు కూడా వైజాగ్ వాడే అక్కడ బొమ్మ హిట్ చేయాల్సిన బాధ్యత నీదే అని అన్నాడు. అభిమాని అన్న మాటకు చిరంజీవి ఇచ్చిన సరదా రిప్లై ఫ్యాన్స్ ని హుశారెత్తించింది. ఇక సత్యదేవ్ గురించి మాట్లాడుతూ అతను నా మీద చూపిస్తున్న ప్రేమ అభిమానం చూసి ముచ్చటేస్తుందని అన్నారు.
తన మొహం మీద ఆ గాయం కూడా తన కొదమ సింహం చూసి అలా చేయడం వల్లే అని చెప్పాడు. సత్యదేవ్ ఒక మంచి నటుడు.. అతనిలో ప్రతిభ గురించే గాడ్ ఫాదర్ సినిమాలో అవకాశం ఇచ్చాం. అతను తీసిన బ్లఫ్ మాస్టర్ సినిమా చూశా ఇతనెవరో బాగా యాక్ట్ చేస్తున్నాడని అనుకున్నా ఆ తర్వాత కలిసి మాట్లాడాం. సత్యదేవ్ కు జీబ్రా పెద్ద సక్సెస్ అవ్వాలని అతను ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని అన్నారు చిరంజీవి.
ఈ ఇయర్ సక్సెస్ అయిన సినిమాల గురించి కూడా ప్రస్తావించారు చిరంజీవి. పెద్ద సినిమాలు ఒక ఐదారు ఆడితే సరిపోదని.. అన్ని సినిమాలు ఆడాలని అన్నారు. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు హిట్ చేస్తున్నారని.. ఈ ఇయర్ మొదట్లో హనుమాన్ నుంచి టిల్లు2, కమిటీ కుర్రోళ్లు, ఆయ్ దీపావళికి వచ్చిన అమరన్, క, లక్కీ భాస్కర్ ఇలా ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు చిరంజీవి.