ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వారెవ్వా! కేసీఆర్ పై దేశద్రోహం కేసు!

నిజానికి ఈ మాట అనే ధైర్యం ప్రధాని నరేంద్ర మోడీకి, హోమ్ మంత్రి అమిత్ షా కు కూడా లేదు. కానీ.. వారి పార్టీ ఎంపీలు అయిన బండి సంజయ్, ధర్మపురి శ్రీనివాస్, సోయం బాపురావు అంటున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం అనేది.. దేశద్రోహం అవుతుందట. అందువల్ల, దానికి కారకుడు అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలట.

తెలంగాణ లోని ముస్లిం మైనారిటీల్లో కేసీఆర్ ఇమేజిను మరింతగా అమాంతం పెంచేందుకు బీజేపీ నాయకులు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లున్నారు. బండి సంజయ్.. తనకు రాష్ట్ర బీజేపీ సారధిగా పగ్గాలు చేతికి రాగానే.. తన మార్క్ తేడా చూపించడానికి ఇలాంటి అతిశయోక్తులతో కూడిన వీర బీభత్స విమర్శలకు దిగుతున్నట్లుగా కనిపిస్తోంది.

నిజానికి కేంద్రప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం సీఏఏ పట్ల దేశవ్యాప్తంగా అన్ని విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్డీయే కూటమిలో పార్టీలు తప్ప ఏ ఒక్కరూ దీనిని సమర్ధించడం లేదు. దీనిని అడ్డుకోవాలని సాగుతున్న ఆందోళనలు పలుచోట్ల హింసాత్మక రూపం దాలుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో మొండిగానే ఉంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ సీఏఏ విషయంలో వెనక్కు తగ్గేది లేదని మోడీ పలు సందర్భాల్లో తేల్చి చెబుతున్నారు. అంతేతప్ప… సీఏఏను విమర్శిస్తున్న నాయకులని దేశద్రోహులని అనే సాహసం చేయడం లేదు. అదే క్రమంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీయేతర ప్రభుత్వాలు ముస్లిం మైనారిటీల్లో తమ ఆదరణ కాపాడుకోవడానికి.. సీఏఏను వ్యతిరేకిస్తున్నాయి.

తమతమ అసెంబ్లీల్లో వ్యతిరేక తీర్మానాలు చేస్తున్నాయి. జగన్ కూడా అసెంబ్లీలో అలాంటి తీర్మానం చేస్తాం అని ఇదివరకే ప్రకటించారు. కేసీఆర్ ఆల్రెడీ చేశారు. నిజానికి ఇలాంటి తీర్మానాలు వలన సీఏఏ చట్టానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. అసెంబ్లీల తీర్మానాల వలన కేంద్రం చేసిన చట్టం ఆగదు. కానీ, ఆ చట్టం విషయంలో తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయడానికి మాత్రమే వారు తీర్మానాలు చేస్తున్నారు.

అందుకని కేసీఆర్ మీద దేశద్రోహం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేయడం కామెడీ గా ఉంది. ఆయన మాటలే గనుక బీజేపీ వైఖరి అయితే గనుక, ఎందరు ముఖ్యమంత్రుల మీద, దేశంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు మీద ఇలాంటి దేశద్రోహం కేసులు నమోదు చేస్తారో కూడా చూడాలి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరు ఎలా మాట్లాడినా సరే.. మిన్నకుంటే పోయేదానికి, బీజేపీ నాయకులు తమ దుందుడుకు మాటల ద్వారా.. కోతిపుండు బ్రహ్మ రాక్షసి గా మారుస్తున్నట్లు కనిపిస్తోంది.

Exit mobile version