ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అన్నయ్య రివాల్వర్ తో కాల్చుకోవాలనుకున్నా : పవన్ కళ్యాణ్

అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రెండవ భాగం వచ్చేసింది. ప్రోమోలో చూపించినట్లుగానే రెండో భాగంలో పూర్తిగా రాజకీయాల గురించి మరియు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం జరిగింది. చిన్నతనంలోనే ఎన్నో సంఘటనలను చూశానని మానసికంగా కృంగి పోయానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. చిన్నతనంలో అనారోగ్య పరిస్థితుల కారణంగా స్నేహితులతో కలవలేక పోయేవాడిని.. స్కూల్ కి సరిగా వెళ్లలేక పోయేవాడిని. దాంతో 17 ఏళ్ల వయసులో మానసికంగా కృంగి పోయి చనిపోవాలనుకున్నాను.

ఆ సమయంలో అన్నయ్య లైసెన్స్ రివాల్వర్ తీసుకొని కాల్చుకుందాం అనుకున్నాను. అప్పుడే వదిన సురేఖ గమనించారు. ఎందుకలా ఉన్నావ్ అంటూ ప్రశ్నించడంతో చనిపోవాలనిపిస్తుందని చెప్పాను. దాంతో అన్నయ్య వద్దకు వదిన తీసుకు వెళ్లారు. అప్పుడు అన్నయ్య పరీక్షలపై గురించిన ఆలోచన అక్కర్లేదు బతికి ఉండరా అని అన్నాడు.

ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా ఉండేది. ఆ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని మంచి నీటిని అందించాలని ప్రయత్నించాను. అందుకోసం కొంత మందిని సంప్రదించాను. కానీ అక్కడ రాజకీయ గ్రూప్స్ అడ్డుకున్నాయి. మంచి చేయడానికి కూడా అడ్డంకులు ఉంటాయి అని అప్పుడే తెలిసింది. ఎన్జీవో ప్రారంభించాలి అనుకున్నాను. తర్వాత నా ఆలోచన పరిధి ఎన్జీవో తో సరిపోదు అనిపించింది. ఇంకా ఏదో పెద్ద చేయాలనిపించింది.. అందుకే పార్టీ పెట్టాను. నేను ఆ ఆలోచనతో పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లాను.

అన్నయ్య చిరంజీవి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఒళ్ళు దాచుకోకుండా కష్టపడే తత్వాన్ని అన్నయ్య నుండి నేర్చుకున్నాను. రాజకీయాల్లో విమర్శలు కచ్చితంగా స్వీకరించాల్సిందే ఎన్ని విమర్శలు అయినా భరించాల్సిందే. దాన్ని కూడా నేను అన్నయ్య నుండి నేర్చుకున్నాను.

అభిమానం వేరు రాజకీయం వేరు. అభిమానం ఓటుగా మారడం వేరు. సినిమా రంగంలో ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నా కూడా ఉన్నత స్థాయికి చేరాలనుకున్న కూడా సమయం పడుతుంది. సినీ పరిశ్రమలో పేరు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి ప్రవేశించి అంతటి నమ్మకం పొందాలంటే కాస్త సమయం పడుతుంది. రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయని నేను అనుకోను. అందుకే కచ్చితంగా భవిష్యత్తులో జనాలు మార్పు కోరుకుంటారని అన్నారు పవన్ కళ్యాణ్.

అధికారం అనేది సాధ్యమైనంత ఎక్కువ మందికి అండగా ఉండాలని మనల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు ఉండకూడదని భావిస్తాను. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ హక్కును సద్వినియోగం చేసుకోగలిగే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నేను ఆశిస్తానని చెప్పుకొచ్చారు.

విశాఖపట్నంలో జరిగిన సంఘటన గురించి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. నేను ఒక అడుగు వేసినా మాట్లాడాలనుకున్నా ప్రభుత్వంలో ఉండే వారికి ఇబ్బందిగా ఉంటుంది. నేను మామూలుగా చేసిన దాన్ని మరో అర్థం చేస్తున్నారు. నేను వైజాగ్ వెళ్లకూడదని ఎన్నో కుట్రలు చేశారు. ఓ మహిళపై అక్రమంగా కేసు పెట్టారు.. ఆధిపత్య ధోరణి కి అది నిదర్శనం. నేను నోరు ఎత్తితే మూసి వేసేందుకు అని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటం గ్రామం వెళ్తున్నప్పుడు అలాగే వ్యవహరించారు. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు.. వెళ్తే గొడవ జరుగుతుందంటూ పోలీసులను ఆపే ప్రయత్నం చేశారు. బాధితులను పరామర్శించడం నా ప్రాథమిక హక్కు అని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళాను అన్నాడు. ఇంకా పలు రాజకీయ అంశాల గురించి కూడా పవన్ కళ్యాణ్ బాలకృష్ణతో అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఆహా ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

Exit mobile version