ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అప్పట్లో ఆయన టెన్త్ పాసయ్యారా?

కరోనా దెబ్బకు అనేకానేక కొత్త నిర్ణయాలు వస్తున్నాయి. సందట్లో తమ వ్యక్తిగత ఇమేజిని పెంచుకోవడానికి.. తామేదో ప్రజలకోసం చాలా చాలా కష్టపడిపోతున్నట్లుగా బిల్డప్ లు ఇవ్వడానికి ప్రయత్నించే నాయకుల కూడా ఎక్కువయ్యారు. అలాంటి వారి సరసకు చేరుతున్నారు… ఏపీసీసీ చీఫ్ శైలజానాధ్! రాష్ట్రంలోని కొన్ని లక్షల కుటుంబాల దృష్టిని తనవైపు ఆకర్షించేలా ఆయన ఒక సరికొత్త డిమాండును వినిపిస్తున్నారు.

ఇంతకూ ఆయన డిమాండ్ ఏంటంటే.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేయాలట. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న పిల్లలందరినీ కూడా ఏకంగా ఇంటర్మీడియట్ లోకి ప్రమోట్ చేసేయాలని శైలజా కోరుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిదో తరగతి వరకు అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలను రద్దు చేసేసి.. నేరుగా పై తరగతుల్లోకి ప్రమోట్ అయి వెళ్లే సదుపాయం కల్పించింది. పదోతరగతి పరీక్షల్ని మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేశారు.

తాజాగా శైలజానాధ్ ఈ పరీక్షలను కూడా రద్దు చేసేయాలని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రాష్ట్రంలో అతీగతీ లేదు. ఆ పార్టీ గురించి, ఆ నాయకుల మాటల గురించి రాష్ట్రంలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి నేపథ్యంలో.. రాష్ట్రంలోని పదోతరగతి చదువుతున్న విద్యార్థులు అందరి తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించేలా శైలజా ప్రకటన ఉంది. ఇలాంటి డిమాండు పట్ల వారందరూ కూడా సహజంగానే ఆసక్తి చూపించే అవకాశం ఉంది. తద్వారా తనకు, కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజల్లో మళ్లీ కాస్త గుర్తింపు వస్తుందని శైలజా ఆశపడుతుండవచ్చు.శైలజా డిమాండ్ విన్నవారు అప్పట్లో ఆయన టెన్త్ మొదటి దఫా పాసు కాలేదేమో అని జోకులు వేసుకుంటున్నారు.

కరోనా సమయంలో తమ వ్యక్తిగత ఇమేజిని పెంచుకోవడానికి కక్కుర్తి పడుతున్న నాయకులు చాలా మందే తయారవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు కరోనా లాక్ డౌన్ వలన ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేదందుకు ఎన్ని రకాల వెసులుబాట్లు కల్పించగలదో అన్నీ చేస్తోంది. అన్ని రకాలుగానూ ప్రజలను ఆదుకునేందుకు కసరత్తు జరుగుతూనే ఉంది. అయితే కొందరు నాయకులు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విధించే పన్నులన్నీ కూడా రద్దు చేసేయాలని, కనీసం వాయిదా కూడా అడగకుండా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. అసంబద్ధమైన డిమాండ్లతో ప్రజలను ఆకట్టుకోవచ్చునని అనుకుంటున్నారు గానీ.. తామే నవ్వులపాలు అవుతామనే సంగతి వారు తెలుసుకోవడం లేదు.

Exit mobile version