హైదరాబాద్ నుంచి తన స్వస్థలానికి రైల్లో ప్రయాణిస్తూ గోదావరిలో దూకి చనిపోవాలనుకున్నారు. అందుకు మానసికంగా సిద్ధమైపోయిన ఆయన.. చివరి క్షణాల్లో తన కొడుకులు గుర్తుకొచ్చి ఆగిపోయారు.. తాను ఆత్మహత్య చేసుకుంటే కొడుకుల్ని తన భార్య ఎలా చూసుకుంటుంది.. వాళ్ల భవిష్యతేంటి అనుకుని ఆ ఆలోచన మానుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకుందాం అనుకోవడానికి కారణం.. దర్శకుడిగా అరంగేట్రం చేసిన చెవిలో పువ్వు చిత్రమేనట.
రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఈవీవీ తీసిన తొలి సినిమా చెవిలో పువ్వు ఫ్లాప్ అయింది. దీంతో ఈవీవీని ఎవ్వరూ పట్టించుకోలేదట. మరో అవకాశం రావడం కష్టమే అనిపించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆయన.. ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన చేశాడు. ఐతే చివరి క్షణంలో వెనక్కి తగ్గిన ఆయన.. దర్శకుడిగా అవకాశం రాకపోతే మళ్లీ కోడైరెక్టర్‌గా పని చేసి అయినా బతుకుదాం అనుకున్నారు.
ఐతే ఈవీవీలో ప్రతిభను గుర్తించిన అగ్ర నిర్మాత రామానాయుడు.. ఆయనకు దర్శకుడిగా మరో అవకాశం ఇచ్చారు. అలా తీసిన చిత్రమే.. ప్రేమఖైదీ. ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఈవీవీ కెరీర్‌ను మార్చింది. ఈ సినిమాకు 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అల్లరి నరేష్.. తన తండ్రి ఆత్మహత్య వరకు వెళ్లిన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.