ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

తమిళం, హిందీలో కూడా వాళ్లిద్దరే

తెలుగు హీరోల సినిమాలు వేరే భాషల్లో నామమాత్రంగా డబ్ అయ్యేవి ఒకప్పుడు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారాయి. మన వాళ్ల సినిమాలు ఒకేసారి బహు భాషల్లో తెరకెక్కుతున్నాయి. వేరే భాషల్లోనూ మన వాళ్లు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా కోసం తమిళంలో డబ్బింగ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ కూడా ‘బాహుబలి: ది కంక్లూజన్’కు వాయిస్ ఇచ్చాడు. ఇప్పుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసమని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పెద్ద సాహసమే చేస్తున్నారు. తెలుగు కాకుండా రెండు భాషల్లో వీళ్లిద్దరూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుండటం విశేషం. తమిళంతో పాటు హిందీలోనూ వీళ్లిద్దరి గొంతే వినిపించనుంది.

తెలుగు హీరోలు చాలామందికి తమిళం వచ్చన్న సంగతి తెలిసిందే. వాళ్ల కుటుంబాలు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినవే. దీంతో చిన్నతనంలో తమిళంతో టచ్ ఉంది. ఐతే తారక్, చరణ్ ఊహ తెలిసే సమయం నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నారు.

వాళ్లకు తమిళంపై ఏమాత్రం పట్టు ఉందన్నది సందేహమే. చరణ్‌కు ఇంతకుముందు హీందీ మూవీ ‘జంజీర్’లో నటించిన అనుభవం ఉంది. మరి ఆ అనుభవం ఇప్పుడు కలిసొస్తుందేమో చూడాలి. జక్కన్న అంటేనే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కాబట్టి ప్రతి భాషలోనూ డబ్బింగ్ పక్కాగా ఉండేలా చూసుకుంటాడనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో వర్క్ ఫ్రమ్ హోం చేస్తోంది ‘ఆర్ఆర్ఆర్’ టీం. తాజాగా రాజమౌళి, కీరవాణి, తమిళ రచయిత మదన్ కార్కీలతో కలిసి ఎన్టీఆర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ డబ్బింగ్ పని లాగిస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కార్కీ ట్విట్టర్లో షేర్ చేశాడు.

Exit mobile version