అతను మళ్లీ భారత జట్టుకు ఆడే విషయమై.. ఇంకా రిటైర్మెంట్ గురించి గత ఏడెనిమిది నెలల్లో ఎన్నో ఊహాగానాలు నడిచాయి. కానీ అతడి భవితవ్యంపై ఎవరికీ క్లారిటీ లేకపోయింది. చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి. భారత జట్టు ఇంటా బయటా ఎన్నో సిరీస్‌లు ఆడేసింది.
కానీ ఎందులోనూ ధోని లేడు. అంతర్జాతీయ క్రికెట్లో తన భవితవ్యంపై ధోని ఏమీ మాట్లాడలేదు. జట్టు యాజమాన్యం, సెలక్టర్లు కూడా మౌనం వహించారు. ఇంతలో ఐపీఎల్ 14వ సీజన్‌కు రంగం సిద్ధమైంది.
ఈ లీగ్‌లో తాను నడిపించే చెన్నై సూపర్ కింగ్స్ కోసమని చెన్నై వచ్చాడు ధోని. మళ్లీ బ్యాటు పట్టాడు. మైదానంలోకి వెళ్లాడు. సాధన చేశాడు. ఇక అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మళ్లీ ఐపీఎల్‌లో అదరగొడతాడు. తాను ఫిట్ అని, ఫాంలో ఉన్నానని చాటుతాడు.
ఎలాగూ పంత్, శాంసన్ లాంటి వాళ్లు ఆశించిన స్థాయిలో రాణించట్లేదు కాబట్టి.. సెలక్టర్లు ధోనీ వైపే చూస్తారు.. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ధోనిని పరిగణనలోకి తీసుకుంటారు అని ఎన్నో కలలు కన్నారు. తీరా చూస్తే ఐపీఎల్-13 వాయిదా పడిపోయింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏఫ్రిల్ 15 తర్వాత కూడా ఐపీఎల్ జరిగేలా లేదు.
దీంతో ధోనికి 8 నెలల విరామం తర్వాత కూడా మ్యాచ్ ప్రాక్టీస్ దక్కదు. ఐపీఎల్ లేదంటే మరే దేశవాళీ టోర్నీలో అయినా ధోని పాల్గొంటాడా అన్నది సందేహమే. అటు ఇటుగా ఏడాది పాటు అతడికి విరామం రాబోతున్నట్లే. ఇంతకుముందే ధోనిని ఎంపిక చేయని సెలక్టర్లు.. ఇంత గ్యాప్ తర్వాత అతణ్ని తీసుకుంటారా అన్నది డౌటే.
ఈ నేపథ్యంలో గవాస్కర్ కూడా ధోని మళ్లీ టీమ్ ఇండియాలోకి రావడం డౌటే అని తేల్చేశాడు. అతను చడీచప్పుడు లేకుండా రిటైరైపోతాడని సంకేతాలిచ్చాడు. చివరికి అదే జరిగేలా కనిపిస్తోంది.