ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నయన్ కు ధనుష్ మరో షాక్.. 24 గంటల్లో డిలీట్ చెయ్యాలంటూ వార్నింగ్?

తమిళ హీరో ధనుష్, హీరోయిన్ నయనతార మధ్య వివాదం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నయన్ తన డాక్యుమెంటరీలో ‘నేనూ రౌడీనే’ సినిమాలోని పాటలు, ఫోటోలు వాడుకోడానికి అనుమతి ఇవ్వలేదంటూ బహిరంగ లేఖ రాయడంతో ఇద్దరి మధ్య విబేధాలు బయటపడ్డాయి. ట్రైలర్ లో 3 సెకండ్ల బిహైండ్‌ ది సీన్స్‌ విజువల్స్ ఉపయోగించినందుకు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ ధనుష్ లీగల్ నోటీసులు పంపినట్లు నయనతార తెలిపింది. ఈ క్రమంలో ధనుష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అయితే నయన్ కు ధనుష్ మరోసారి షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ మంగళవారం నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా నుంచి 37 సెకన్ల విజువల్స్ వాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 24 గంటల్లోగా ఆ ఫుటేజీని తొలగించాలని ధనుష్ తన లాయర్ల ద్వారా నయన్ – విఘ్నేష్ శివన్ దంపతులకు అల్టిమేటం ఇచ్చారని ప్రచారం సాగుతోంది. ”నయనతార డాక్యుమెంటరీలో నా క్లయింట్ యొక్క ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలోని కంటెంట్‌ని ఉపయోగించడం ద్వారా మీరు కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించారు. కాబట్టి ఆ కంటెంట్‌ను 24 గంటల్లోగా తీసివేయాలని కోరుతున్నాం. లేదంటే నా క్లయింట్ దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మీ కంపెనీ, నెట్ ఫ్లిక్స్ సంస్థ నుంచి కేవలం రూ.10 కోట్లు పరిహారం మాత్రమే కాదు.. మరింత నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది” అని ధనుష్ తరపు లాయర్ హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

నయనతార రాసిన ఓపెన్ లెటర్ లో పేర్కొన్న బీటీఎస్ ఫుటేజీ గురించి మాట్లాడుతూ.. ”నా క్లయింట్ ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రానికి నిర్మాత. మీరు తెర వెనుక ఫుటేజీని చిత్రీకరించడానికి నా క్లయింట్ ఎవరినీ నియమించలేదు. మీరు చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవం” అని ధనుష్ తరపు లాయర్లు చెప్పినట్లుగా వార్తా కథనాలు వస్తున్నారు. నిజానికి ధనుష్ నోటీసులతో మళ్ళీ ఎడిట్ చేసి 3 సెకన్ల వీడియోని డిలీట్ చేసినట్లుగా నయన్ తన లేఖలో పేర్కొంది. కానీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం అవుతున్న డాక్యుమెంటరీలో ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’లో మాత్రం 37 సెకన్ల వీడియో క్లిప్పింగ్స్ వాడినట్లుగా తెలుస్తోంది. అలాంటప్పుడు ధనుష్ ను విమర్శిస్తూ నయన్ ఓపెన్ లెటర్ ఎందుకు రాసిందనేది చర్చనీయంశంగా మారింది. ఇదంతా ఆమె తన డాక్యుమెంటరీకి హైప్ తీసుకురావడానికే చేసిందని ధనుష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్ఓసీ ఇవ్వకుండా సినిమాలో ఫుటేజీ యూస్ చేసినందుకు నయనతార దంపతులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ధనుష్ ను కోరుతున్నారు.

2015లో ధనుష్ నిర్మాణంలో విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నానుమ్ రౌడీ ధన్’. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ టైంలోనే నయన్ – విఘ్నేష్ ప్రేమలో పడ్డారు. తమ జీవితంలో అంత ప్రత్యేకమైన సినిమాని డాక్యుమెంటరీలో భాగం చెయ్యాలని భావించారు. అయితే రెండేళ్లుగా హీరో ధనుష్ ని అనుమతి అడుగుతున్నా ఎన్ఓసీ ఇవ్వలేదని నయనతార సోషల్ మీడియాలో ఓ లెటర్ పోస్ట్ చేసింది. ప్రైవేట్ మొబైల్ ఫోన్‌లలో సెట్‌లో తీసుకున్న మూడు సెకన్ల బీటీఎస్ వీడియోను ట్రైలర్ లో ఉపయోగించినందుకు 10 కోట్ల దావా వేసాడని తెలిపింది. ధనుష్ ఇంతలా దిగజారిపోతాడని తాను అనుకోలేదంటూ విమర్శించింది. కాఫీ రైట్ చట్టం ద్వారా న్యాయస్థానంలో గెలిచినా, పైన దేవుడు అంతా చూస్తుంటాడని కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై ధనుష్ స్పందించలేదు కానీ, లీగల్ గానే నయనతార మీద చర్యలు తీసుకోడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

Exit mobile version