ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రజనీకి జీవితాన్ని ప్రసాదించిన ఎన్టీఆర్.. షాకింగ్ నిజాల్ని చెప్పేసిన సూపర్ స్టార్

ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అందరితో అయ్యే పని కాదు. అత్యున్నత స్థాయికి ఎదిగిన తర్వాత అలా చేయటం అందరికి సాధ్యం కాదు. శిఖర సమానుడిగా మారిన వేళ.. తానో మరుగుజ్జు అన్నట్లుగా చెప్పటమే కాదు.. వినయంతో.. భక్తిభావంతో విషయాల్ని చెప్పే వైనం అందరికి సాధ్యం కాదు. తమిళ సూపర్ స్టార్ గా వెండితెర వేల్పుగా వెలిగిపోయే రజనీకాంత్ తాజాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల శంఖారావం సభకు హాజరయ్యారు. విజయవాడలోజరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన రజనీ.. తన ప్రసంగంలో ఆయన ఎమోషనల్ గా మాట్లాడారు.

తన తెలుగు బాగోదని.. తప్పులు ఉండే మన్నించాలన్న ఆయన.. యుగపురుషుడు ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని చెప్పటమే కాదు.. ఆయన తనకు లైఫ్ ఎలా ఇచ్చారన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతానికి చెందిన చేదు అనుభవాల్ని.. చేసిన తప్పుల్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. అలాంటిదేమీ లేకుండా నిజాయితీగా మాట్లాడిన మాటలు చూస్తే.. రజనీ వ్యక్తిత్వం.. ఆయన గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఎన్టీఆర్ తో తాను కలిసి నటించిన టైగర్ సినిమా తనకో జీవితాన్ని ఇచ్చిందన్న రజనీ.. అప్పట్లో ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

రజనీ మాటల్లోనే చదివితే.. ”1977లో రాత్రి పగలు పని చేసేవాడ్ని. నిద్ర ఉండేది కాదు. చెడు అలవాట్లు.. నరాల బలహీనత. ఎక్కువగా కోపం ఉండేది. అందర్నీ కొట్టేసేవాడ్ని. చేతిలో రెండు.. మూడు సినిమాలే ఉన్నాయి. నన్ను బుక్ చేసుకున్న నిర్మాతలంతా అడ్వాన్సు తిరిగి తీసుకున్నారు. టైగర్ కూడా అలానే అవుతుందని అనుకున్నా. అందరూ వద్దన్నా.. ఎన్టీఆర్ మాత్రం మిమ్మల్నే తీసుకోవాలని దర్శకుడు నాతో చెప్పి.. ఆ సినిమాలోకి తీసుకున్నారు. అలా ఎన్టీఆర్ పట్టుబట్టటంతో నేను ఆ సినిమాలో నటించాను. తర్వాత ఇతర నిర్మాతలు వచ్చి సినిమాలు ఇచ్చారు” అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తో సినిమా చేయటం మొదలు పెట్టిన తర్వాత.. నిర్మాతలు తనను నమ్మిన వైనాన్ని చెప్పారు.

ఎన్టీఆర్ ఎంత ఎనర్జటిక్ గా ఉంటారన్న విషయాన్ని ఒక ఉదాహరణతో చెప్పారు రజనీకాంత్. ‘యాక్షన్ సీన్ లో ట్రాలీలో కెమెరా వెంబడిస్తుంది. ఇద్దరు ఫైటర్లను కొట్టుకుంటూ వేగంగా వెళ్లాలి. బ్రదర్ నేను స్పీడ్ గా వెళ్తాను.నా వేగానికి అనుగుణంగా మీరు రావాలన్నారు ఎన్టీఆర్. అప్పటికే రజనీకాంత్ అంటే స్పీడ్.. స్పీడ్ అంటే రజనీకాంత్. అలాంటిది ఆయన నాకే వచ్చి చెబుతున్నారా? అని మనసులో అనుకొని ఓకే సార్ అన్నా. షాట్ అయ్యాక కెమెరామెన్ కట్ చెబుతుంటే నేను వెనుకే ఉన్నా. ఎన్టీఆర్ ముందుకు వెళ్లిపోయారు. ఆయనలో అంత ఎనర్జీ. అప్పుడు ఎన్టీఆర్ అన్న మాటను మర్చిపోలేను. బ్రదర్ నేను కొంచెం నెమ్మదించనా? అని అడిగారు” అని ఎన్టీఆర్ పని తీరు ఎలా ఉండేదన్న విషయాన్ని చెప్పారు.

సమయ పాలన అన్నంతనే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ఆయన మాదిరి డెడికేషన్ తో వ్యవహరించే వారు చాలా చాలా అరుదుగా ఉంటారు. షూటింగ్ అంటే 6.45 గంటలకు సెట్ లో సిద్ధంగా ఉండేవారు. వ్యక్తిత్వానికి ఆయన ఇచ్చే మర్యాద అలాంటిది. సినిమాల్లోనే కాదు బయట కూడా ఆయన అలానే జీవించారన్నారు. ‘రాజమండ్రిలో షూటింగ్ చేస్తుంటే ట్రాఫిక్ లో వేలాది మంది ఉన్నారు. ఏమిటని చూస్తే.. ఆ రోజు దానవీరశూరకర్ణ సినిమా విడుదలైంది. ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో గుర్తు లేదు. ఆ సినిమాతో ఎలా అయినా దుర్యోధనుడి పాత్రలో యాక్టు చేయాలనుకున్నా. ఒక నిర్మాత.. దర్శకుడు ఓకే చేశారు. దుర్యోధనుడి డైలాగ్ అలానే రాయమన్నా. దాన్ని కంఠతా పట్టి స్క్రీన్ టెస్టుకు వెళ్లా. ఎన్టీఆర్.. ఎంజీఆర్ లకు మేకప్ మన్ అయిన పీతాంబరాన్ని పిలిచాం. ఆయన వచ్చారు. బాబు.. తప్పుగా అనుకోవద్దు. ఎన్టీఆర్.. ఎంజీఆర్ తర్వాత ఎవరికీ మేకప్ వేయలేదు అని బొట్టు పెట్టి వెళ్లిపోయారు. తర్వాత దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్ గెటప్ మాదిరి అదే కిరీటం.. అదే శరీరం.. మేకప్ తో ఫోటో షూట్ చేశాం. ఫోటోలు వచ్చాక అంతా బాగుందని అనిపించినా.. నాకే ఏదోలా అనిపించి వదిలేశా’ అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.

సెట్ లో ఎన్టీఆర్ ఉంటే ఎలా ఉంటుందన్న విషయంతో పాటు.. ఆయన ప్రిపరేషన్ ఎంతలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా ఒక ఉదాహరణను చెప్పుకొచ్చారు. ‘1982లో బొబ్బిలి పులి షూటింగ్ ఏవీఎంలో జరుగుతుంటే.. పక్కనే మరో షూటింగ్ లో ఉన్న నేను అక్కడికి వెళ్లాను. అప్పుడే ఆయన ఏపీలో పార్టీ ప్రకటించారు. సెట్ లో అంతా నిశ్శబ్దం. కళ్లుమూసుకొని కూర్చున్నారు ఎన్టీఆర్. ఆ సినిమాలో ఖైదీ పాత్రలో ఆయన రెండు పేజీల డైలాగ్ ను ఎమోషన్ తో ఒకే ఒక్క టేక్ తో పూర్తి చేశా’ అని చెప్పుకొచ్చారు.

Exit mobile version