ముందుగా సిరియాలో 8-9 ఏళ్లుగా సాగుతున్న సివిల్ వార్.. దాని కారణంగా నరకంలా మారిన దేశం.. అక్కడ హృదయ విదారకంగా మారిన పిల్లల కష్టాల గురించి పూరి చెప్పుకొచ్చాడు. అమెరికా లాంటి పెద్ద, సంపన్న దేశంలో మురుగు కాలువల్లో, టన్నెల్స్‌లో, ఫ్లై ఓవర్ల కింద బతుకుతున్న వాళ్లు చాలామంది ఉంటారని.. వాళ్ల కష్టాలు అలవి కానివని చెప్పిన పూరి.. ఫిలిప్పీన్స్‌లో బజావో పీపుల్స్ అనే తెగకు చెందిన వారు చిన్న చిన్న పడవల్లోనే బతుకుతుంటారని.. వాళ్ల జీవితమంతా నీటి మీదే సాగిపోతుందని తెలిపాడు.
ఇక ప్రమాదకరమైన సియాచిన్ పర్వతాల్లో మన దేశ రక్షణ కోసం సైనికులు మైనస్ 52-53 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య పని చేస్తుంటారని.. అక్కడ చలికి వేళ్లు, ముక్కు ఊడి రాలిపోతుంటాయని.. వాళ్ల తిండి కష్టాలు మామూలుగా ఉండవని.. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నో ఏళ్లుగా మన సైనికులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ దేశాన్ని రక్షిస్తున్నారని పూరి చెప్పాడు.
ప్రపంచంలో ఇలాంటి కష్టాలు ఎన్నో ఉన్నాయని.. వాటితో పోలిస్తే లాక్ డౌన్ కష్టాలు అసలు కష్టమే కాదని.. మనందరం యుద్ధ క్షేత్రంలో ఉన్నామని.. అందరూ ప్రభుత్వానికి సహకరించాలని పూరి విజ్ఞప్తి చేశాడు. లాక్ డౌన్ ఏప్రిల్ 15తో ముగియకపోవచ్చని, జూన్ 1 వరకు కొనసాగవచ్చని.. అందుకు సిద్ధంగా ఉండాలని జనాల్ని హెచ్చరించాడు పూరి.