సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ల మీదకు రావడానికి అనుమతి ఉంటే గనుక.. ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క వేళల్లో రోడ్ల మీదకు రావడమూ.. తమ పనులు చక్కబెట్టుకుని పోవడమూ జరుగుతుంటుంది. అదే ఈ కుదింపు వలన.. ప్రతి కాలనీల్లో కూడా ప్రజలందరూ 6-11 గంటల మధ్య మాత్రమే రోడ్ల మీదికి వచ్చేస్తారు. కిరాణా కొట్టులు కావొచ్చు. ఇతర కూరగాయల దుకాణాలు కావచ్చు.. ఆ పరిమితమైన సమయంలో చాలా పెద్ద సంఖ్యలో జనంతో కిటకిటలాడుతూ ఉంటాయి. నిజానికి సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అని అంటున్న నేపథ్యంలో ఇది నష్ట దాయకం.
తెలంగాణలో ఇప్పటికీ ఉదయంనుంచి సాయంత్రం వరకు ప్రజలకు అనుమతి ఉంది. అలా ఉంటే కూడా ఆదివారం నాడు రెండు రాష్ట్రాల్లో ప్రతి చికెన్, మటన్ దుకాణాల వద్ద జనం కిటకిట లాడారంటే అతిశయోక్తి కాదు. అలాంటి అనుమతి సమయాల్ని కుదిస్తే అది మరింత జనసమ్మర్దం పెరగడానికి కారణం అవుతుంది. ప్రాక్టికల్ గా ఎదురుకాగల ఇలాంటి అన్ని రకాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.