ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

100 కోట్ల పారితోషికం క్లబ్ లో భారతీయ హీరోలు

బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లను తేవడం అంటే ఒకప్పుడు అసాధారణ ఫీట్. గజిని చిత్రంతో అమీర్ ఖాన్ తొలిసారి బాలీవుడ్ లో ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత వందల కోట్ల వసూళ్ల ప్రవాహం కొనసాగుతోంది. భారతీయ సినీపరిశ్రమలో 1000 కోట్ల క్లబ్ ఇప్పటికే సాధ్యమైంది. బాలీవుడ్ లో ఖాన్ ల తర్వాత అక్షయ్ కుమర్- అజయ్ దేవగన్- హృతిక్ రోషన్ – రణబీర్ కపూర్- రణవీర్ సింగ్ లాంటి హీరోలు వంద కోట్లు అంతకుమించి వసూళ్లు సాధించగలిగే హీరోలుగా ఎదిగారు. సుమారు 400-500 కోట్ల మేర వసూళ్లను బాలీవుడ్ సినిమాలు సాధిస్తుంటాయి. అమీర్ ఖాన్ నటించిన దంగల్ బాలీవుడ్ లో ఏకైక 1000 కోట్ల క్లబ్ సినిమా. ఈ సినిమా వరల్డ్ వైడ్ 2000 కోట్లు వసూలు చేసింది. అయితే బాహుబలి – బాహుబలి 2 చిత్రాలతో దర్శకధీరుడు రాజమౌళి సరికొత్త బెంచ్ మార్క్ ని సాధించిన ఏకైక సౌత్ దర్శకుడిగా రికార్డులకెక్కారు. బాహుబలి 2 చిత్రం దాదాపు 1800కోట్లు వసూలు చేయడం అది కూడా దేశీ వసూళ్లలో ఇప్పటికీ నంబర్ వన్ స్థానంలో నిలవడం ఒక సంచలనం. కన్నడ స్టార్ హీరో యష్ కేజీఎఫ్ 2తో 1000 కోట్ల క్లబ్ హీరోగా సంచలనం సృష్టించాడు. అయితే ఇటీవలే పఠాన్ చిత్రంతో కింగ్ ఖాన్ షారూఖ్ 1000 కోట్ల క్లబ్ ని అందుకోవడం ఒక మిరాకిల్. ఒక పూర్తి స్థాయి యాక్షన్ అడ్వెంచర్ కథతో ఖాన్ ప్రయోగం ఫలించిందన్న చర్చా సాగింది.

ఇదిలా ఉంటే పారితోషికంలో ఏ హీరో రేంజు ఎంత? 100 కోట్ల పారితోషికం అందుకునే భారతీయ హీరోలు ఎందరు ఉన్నారు? అన్నది ఆరా తీస్తే ఈ జాబితాలో ఖాన్ ల త్రయం షారూఖ్-సల్మాన్- అమీర్ తో పాటు ప్రభాస్- రజనీకాంత్ టాప్ 5 స్టార్లుగా రేసులో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో అల్లు అర్జున్- రామ్ చరణ్ – ఎన్టీఆర్ – మహేష్ లాంటి స్టార్లు ఈ జాబితాలో చేరుతున్నవారిగా మీడియాల్లో విస్త్రతంగా చర్చ సాగుతోంది. అయితే ఇప్పటివరకూ దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా తమిళ హీరో దళపతి విజయ్ పేరు ఇటీవల తెరపైకి వచ్చింది.

విజయ్ నటిస్తున్న తదుపరి చిత్రానికి 200 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడని తమిళ మీడియాలో ప్రచారం ఉధృతంగా సాగింది. అయితే ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. విజయ్ సినిమాకి 200 కోట్ల మేర మార్కెట్ మాత్రమే ఉంది. రికార్డులు తిరగరాసే బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే అతడు నటించిన సినిమా 300 కోట్ల వరకూ వసూలు చేసేందుకు ఆస్కారం ఉంది. అలాంటప్పుడు అతడు 200 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తాడని భావించలేం. విజయ్ కూడా ఇతర స్టార్ హీరోల తరహాలోనే 100 కోట్లు అందుకునే హీరోల జాబితాలో ఉన్నాడని భావించాలి.

ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాలకు ఒక్కో సినిమాకు తన మార్కెట్ రేంజుకు తగ్గట్టే సుమారు 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడని ప్రచారం ఉంది. ఆదిపురుష్ 3డి- సలార్- ప్రాజెక్ట్ కే చిత్రాలకు వంద కోట్లు వసూలు చేస్తున్నాడని ఇప్పటికే టాక్ వినిపించింది. 1000 కోట్ల క్లబ్ హీరోగా రికార్డులకెక్కిన అమీర్ ఖాన్- 100-150 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా అందుకుంటున్నాడన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. అలాగే పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో కంబ్యాక్ అయిన షారూఖ్ ఖాన్ -100 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా అందుకుంటున్నాడని.. భాయ్ సల్మాన్ ఖాన్ -100 కోట్ల పారితోషికం లాభాల్లో వాటా తీసుకుంటాడని ప్రచారం ఉంది.

సౌత్ లో ఎందరు స్టార్ హీరోలు ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉందని నిరూపించిన సూపర్ స్టార్ రజనీకాంత్ 79ఏళ్ల వయసులోను ఎంతో యాక్టివ్ గా సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు 100 కోట్లు అందుకున్నారన్న టాక్ వినిపించింది. అయితే ఏజ్ తో పాటు రజనీకాంత్ నటించిన సినిమాలన్నీ ఫ్లాపులవ్వడంతో తన పారితోషికం రేంజు తగ్గించుకున్నారన్న టాక్ ఉంది. శంకర్ లాంటి గ్రేట్ డైరెక్టర్ తో సినిమా తీసినప్పుడు రజనీ 100కోట్లు అందుకునేందుకు ఛాన్సుంది.

మరోవైపు యువరక్తం దూసుకొస్తోంది. పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మార్కెట్ ని అమాంతం పెంచుకున్నాడు. హిందీ బెల్ట్ సహా పాన్ ఇండియాలో అతడు సత్తా చాటాడు. ఇప్పుడు పుష్ప 2తో 1000 కోట్ల క్లబ్ అందుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్నాడు. మరోవైపు ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ ని తెచ్చిన ఎన్టీఆర్ – రామ్ చరణ్ 1000 కోట్ల క్లబ్ హీరోలుగా సత్తా చాటడంతో వీళ్ల పారితోషికాలు అమాంతం పెరిగాయని చర్చ సాగుతోంది. అలాగే దర్శకధీరుడు రాజమౌళితో తదుపరి సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ సైతం ఈ కొత్త చిత్రానికి 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నెమ్మదిగా 100 కోట్ల పారితోషికం క్లబ్ లో అరడజను పైగా దక్షిణాది హీరోలు చేరుతుండగా..అటు ఉత్తరాదినా మరో అరడజను మంది హీరోలు ఉన్నారు.

తమిళం నుంచి స్టార్ హీరో సూర్య వారియర్ కాన్సెప్టుతో పాన్ ఇండియా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ భారీ వారియర్ సినిమాతో 1000 కోట్ల క్లబ్ ని సాధిస్తే అతడి పారితోషికం రేంజ్ అమాంతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సత్తా చాటిన కమల్ హాసన్ 50 కోట్లు మించి పారితోషికం అందుకుంటున్నారన్న గుసగుసలు వినిపించాయి. స్టార్లకు ఉన్న క్రేజ్ – ఫాలోయింగ్- ఇమేజ్ దృష్ట్యా ఈ విలువలన్నీ ఉజ్జాయింపు అంచనా విలువలుగా పరిగణించాలి. సినిమా సినిమాకి స్టార్ల పారితోషికాల రేంజ్ మారుతూనే ఉంటుందనడంలో సందేహం లేదు. సక్సెస్ రేటును బట్టి హీరోకి పారితోషికం ఫిక్స్ అవుతుంది.

Exit mobile version