ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

88 ఏళ్ల వయసులో తెలుగు దర్శకుడి సినిమా

తెలుగు సినిమా చరిత్రలో సింగీతం శ్రీనివాసరావుది ఓ ప్రత్యేక అధ్యాయం. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆయన స్థాయి లాంగెవిటీతో ఇంకెవరినీ చూసి ఉండం. ఎంత పెద్ద దర్శకులైనా సరే.. 60 ఏళ్లు పైబడ్డాక సినిమాలు ఆపేస్తుంటారు. కానీ ఆయన మాత్రం ఆ వయసులోనూ చురుగ్గా సినిమాలు చేశారు. ఎప్పుడూ నవ యువకుడిలా ఆయన చూపించే ఉత్సాహానికి ఆశ్చర్యం కలగక మానదు.

కొన్నేళ్ల కిందట కూడా ‘వెల్కమ్ ఒబామా’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. తన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా… ఆయన మాత్రం సినిమాలు ఆపట్లేదు. నందమూరి బాలకృష్ణతో తన క్లాసిక్ మూవీ ‘ఆదిత్య 369’కు సీక్వెల్ తీయాలన్న ఆలోచన కూడా చేశారాయన. కానీ కార్యరూపం దాల్చలేదు. అయినా సింగీతంలో ఉత్సాహం తగ్గలేదు.

ఇప్పుడాయన 88 ఏళ్ల వయసులో సినిమా డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఓ లెజండరీ సింగర్ బయోపిక్‌ను ఆయన డైరెక్ట్ చేయనున్నారట. ఆ సింగర్ ఎవరన్నది బయటకి రాలేదు. ఐతే ఈ సినిమా కోసం స్క్రిప్టు పనులు జోరుగా సాగుతున్నాయట. ఓ నిర్మాత సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడట. ఇది బహుభాషా చిత్రంగా తెరకెక్కనుందట.

ఈ సినిమా నిజంగానే పట్టాలెక్కితే ఇండియాలో కొంచెం గుర్తింపు ఉన్న వాళ్లలో 88 ఏళ్లకు సినిమా డైరెక్ట్ చేసిన తొలి దర్శకుడిగా సింగీతం రికార్డు సృష్టిస్తాడేమో. సింగీతం నుంచి ఎలాంటి సినిమా వస్తుందన్నది పక్కన పెడితే కూర్చోడానికి కూడా ఓపిక ఉండని వయసులో ఓ సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ కావడాన్ని ప్రశంసించాల్సిందే. మరి ఈ నవ యువకుడు ఈ వయసులో తన దర్శకత్వ ప్రతిభను ఎలా చాటుకుంటాడో చూడాలి.

Exit mobile version