దేశంలో కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఏనాడో కాలం చెల్లిపోయింది. తెలుగునాట, కమ్యూనిస్టు పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇదంతా స్వయంకృతాపరాధమే. సిద్ధాంతాలకి తిలోదకాలిచ్చేసి.. ఎన్నికల వేళ ఏదో ఒక పార్టీ పంచన చేరడమే కమ్యూనిస్టు పార్టీల పతనానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇక, తెలుగునాట ఎర్ర పార్టీల ఉనికిని నాశనం చేసింది అటు నారాయణ, ఇటు రాఘవులు.. అన్న విమర్శ వుండనే వుంది.
ఇప్పుడిదంతా ఎందుకంటే, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెగ మమకారం ప్రదర్శించేస్తూ.. అధికార, విపక్ష పార్టీల్ని కడిగి పారేసేందుకు ప్రయత్నించారు. ఈయనగారికి వున్నపళంగా ఆంధ్రప్రదేశ్ బాగోగులు గుర్తుకురావడమేంటి చెప్మా.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీని విమర్శించారు సరే.. ఈ క్రమంలో జనసేననీ విమర్శించడం.. రాజకీయాల్లో భాగమే కావొచ్చు. కానీ, మధ్యలో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గోల ఈయనెందుకు.? అన్నది జనసైనికుల ప్రశ్న.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేస్తోన్న విషయం విదితమే. ‘మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ మాసికం చేయడమా.?’ అంటూ నారాయణ నోరు పారేసుకోవడాన్ని జనసైనికులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. పొత్తుల గురించి విమర్శలు చేసే నైతిక హక్కు నారాయణకు లేదన్నది జనసైనికుల ప్రశ్న. గతంలో చంద్రబాబుని విమర్శించి, ఆ తర్వాత అదే చంద్రబాబుతో మహాకూటమి కట్టిన నారాయణ, ఇప్పుడు జనసేనని పొత్తుల పేరుతో విమర్శించడం హాస్యాస్పదం కాక మరేమిటని ప్రశ్నిస్తున్నారు జనసైనికులు.
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శల స్థాయికి రాజకీయ నాయకుల నైతికత ఏనాడో దిగజారిపోయింది. సాధారణంగా ఇలాంటి విమర్శల విషయంలో కమ్యూనిస్టు పార్టీలు ఒకింత విజ్ఞత పాటిస్తుంటాయి. పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తే, రాజకీయంగా తన ఉనికిని కాస్తో కూస్తో కనిపిస్తుందనుకునే స్థాయికి నారాయణ తన స్థాయిని దిగజార్చేసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?