దాయాది దేశం పాకిస్తాన్ మనల్ని దొంగ దెబ్బ తీయడమే తప్ప.. నేరుగా ఎదుర్కొనే ధైర్యం ఎన్నడూ చేయదు. మన బలం, బలగం ముందు తన సత్తా ఏపాటిదో తెలుసు కనుకే ఆ సాహసం చేయదు. అందుకే కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ.. దేశంలోని కీలక ప్రాంతాల్లో విధ్వంసానికి తెగబడటానికి కుట్రలు చేస్తుంటుంది. ఒకవేళ భారత్ నేరుగా దాడికి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పటికే ఆ దేశానికి బాగా తెలుసు.
ఈ నేపథ్యంలోనే భారత వాయసేనకు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ ఎపిసోడ్ లో పాక్ ఆర్మీ చీఫ్ గజగజా వణికిపోయారట. అలాగే పుల్వామా దాడి తమ ఘనతే అని కూడా పొరుగుదేశం ఘనంగా ప్రకటించుకుంది. ఈ మేరకు ఆయా విషయాలను ఆ దేశ ప్రజాప్రతినిధులే బట్టబయలు చేశారు. కాశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది అమరులైన సంగతి తెలిసిందే.
అనంతరం దీనికి ప్రతీకారంగా పాక్ కు చెందిన జైషే మహమ్మద్ తీవ్రవాద స్థావరంపై భారత వాయుసేన దాడులు చేసింది. తర్వాత ప్రతిగా పాక్ భారత భూభాగంపై దాడికి యత్నించింది. 2019 ఫిబ్రవరి 27న ఎఫ్16 విమానం భారత గగనతలంలోకి దూసుకురావడంతో మన వింగ్ కమాండర్ అభినందన్ మిగ్ విమానంతో దానిని వెంటాడి కూల్చివేశారు. ఈ క్రమంలో మిగ్ కూడా కూలిపోవడంతో ఆయన పాక్ సేనలకు బందీగా చిక్కారు.
రెండు దేశాల చర్చల అనంతరం మార్చి ఒకటో తేదీని అభినందన్ ను సరిహద్దుల వద్ద పాక్ అప్పగించింది. అయితే, అభినందన్ బందీగా ఉన్న క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాగా వణికిపోయారంటూ పాక్ ఎంపీ అయాజ్ సాదిక్ తెలిపారు. అభినందన్ ను అప్పగించకుంటే భారత్ దాడి చేయడం ఖాయమంటూ జావేద్ తీవ్రంగా వణికిపోతూ చెప్పారని వెల్లడించారు. ఆ సమయంలో ఆయన కాళ్లు వణకడంతోపాటు ముఖంపై చెమటలు పట్టాయని నాడు జరిగిన ఘటనను సాదిక్ కళ్లకు కట్టినట్టు వివరించారు.
అయితే, ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడైన మంత్రి ఫవద్ చౌదరి సంచలన విషయాన్ని బయట పెట్టారు. గురువారం పాక్ జాతీయ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. భారత్ ను వారి గడ్డపైనే దెబ్బకొట్టాం. ఇమ్రాన్ నాయకత్వంలో పాక్ పుల్వామాలో విజయం సాధించింది‘ అని వ్యాఖ్యానించారు. అభినందన్ ఎపిసోడ్ లో సాదిక్ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. మొత్తానికి పాక్ ప్రజాప్రతినిధుల సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.