అసమానతలు గెలిచి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అసమానతలు ఉన్నాయని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఆరోపించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని, ప్రత్యేక రాష్ట్రంలో అతివలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్ లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు లక్ష్యంగా విమర్శలు సంధించారు. తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని.. ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదని చెప్పారు. రాణీ రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలుసన్నారు.
ఉద్యమాల్లో మహిళలు కీలక పాత్ర పోషించారని.. కానీ ప్రస్తుతం తెలంగాణ సమాజంలో స్త్రీల ప్రాతినిధ్యం ఎంత ఉందని ప్రశ్నించారు. తెలంగాణ సమాజంలో అతివల ప్రాతినిధ్యం ఎంతో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో అధికార పార్టీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతోమంది మహిళలు మంత్రి పదవులు అలంకరించారని, ప్రత్యేక రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత.. అది కూడా ఇద్దరికే అవకాశం ఇచ్చారని విమర్శలు సంధించారు. మహిళలు అన్నింటా సగం అయినప్పుడు, ఈ అసమానతలు ఎందుకో పాలకులు చెప్పాలని డిమాండ్ చేశారు.