మరోపక్క, అచ్చెన్నాయుడు వర్గానికి షాకిస్తూ, నామినేషన్ వేసేందుకు వచ్చిన అప్పన్నకు వైసీపీ కీలక నేతలు అండగా నిలిచారు. ఈ క్రమంలో నిమ్మాడలో కాస్తంత ఉద్రిక్త పరిస్థితులే చోటు చేసుకున్నాయి. పంచాయితీ ఎన్నికలు రాజకీయ నాయకులకు ఎంత ప్రతిష్టాత్మకమో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
అచ్చెన్నాయుడు.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు. మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సొంత గ్రామంలో టీడీపీ మద్దతుదారుడిని అచ్చెన్నాయుడు గెలిపించుకోలేకపోతే ఎంత అవమానకరమైన పరిస్థితిగా అది మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి, రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది మంత్రులకూ, అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకూ ఆయా పంచాయితీల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నా.. వాటిల్లో చాలావరకు బయటకు రావడంలేదు.
‘ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలి..’ అన్న కోణంలో కొందరు రాజకీయ ప్రముఖులు, అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఖర్చు చేస్తున్నారట కొన్ని పంచాయితీల్లో. ఏకగ్రీవాల పేరుతో ఓ పంచాయితీలో వేలం పాట ఏకంగా 55 లక్షలు పలికిందంటూ మీడియాలో వార్తలు చూస్తున్నాం. అధికారిక లెక్కలు ఇలా వుంటే, అనధికారిక లెక్కల ప్రకారం చూస్తే, కొన్ని చోట్ల కోటి మార్కు కూడా దాటేసినట్లే తెలుస్తోంది. ఇదంతా ఎందుకు.? అంటే, రాజకీయ ప్రతిష్ట కోసం. ఈ ప్రతిష్ట కోసం వ్యవస్థల్ని దిగజార్చేయడానికీ రాజకీయ నాయకులు, పార్టీలూ వెనుకాడ్డంలేదు.