ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నేనా.. ఘోస్ట్ డెరెక్షనా-అడివి శేష్

ఒక క్షణం.. ఒక గూఢచారి.. ఒక ఎవరు.. ఈ మూడు సినిమాల్లోనూ ఎన్నో సారూప్యతలు కనిపిస్తాయి. ఈ మూడూ థ్రిల్లర్ జానర్ సినిమాలే. మూడింట్లోనూ అడివి శేషే హీరో. ఆ మూడు చిత్రాల స్క్రిప్టుల్లో, మేకింగ్ శేష్ పాత్ర ఉంది. ఈ మూడు సినిమాల్లోనూ స్క్రీన్ ప్లే చాలా బిగితో కనిపిస్తుంది. బడ్జెట్ పరిమితుల మధ్యే మంచి బిగితో సినిమా తీశారు. ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో మెప్పించి ఘనవిజయాన్నందుకున్నారు.

మూడు సినిమాల్లో కామన్‌గా ఉన్నది శేషే కావడంతో మెజారిటీ సక్సెస్ క్రెడిట్ కూడా అతడి ఖాతాలోకే వెళ్లింది. మూడు సినిమాలకు దర్శకులు వేరు అయినా. ఔట్ పుట్, రిజల్ట్ ఒకేలా ఉండటంతో శేష్ ఈ సినిమాలకు ఘోస్ట్ డైరెక్షన్ చేశాడన్న అభిప్రాయాలు కూడా జనాల్లో ఉన్నాయి. ఇదే విషయం శేష్ వద్ద ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తే.. అలాంటిదేమీ లేదని నవ్వేశాడు.

పైన చెప్పుకున్న సినిమాలు విజయవంతం కావడంతో వాటి దర్శకుల పాత్ర ఎంతో కీలకం అని శేష్ చెప్పాడు. ఆ సినిమాల స్క్రిప్టు, మేకింగ్‌లో తాను ఇన్వాల్వ్ అయిన మాట వాస్తవమే అని.. కానీ దర్శకుల పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదని చెప్పాడు. తాను వరుస విజయాలు సాధించి ఇప్పుడీ స్థితిలో ఉన్నానంటే దర్శకులే కారణమని.. వాళ్ల క్రెడిట్ తాను తీసుకోనని శేష్ చెప్పాడు.

‘గూఢచారి’ కోసం శశికిరణ్ తిక్క ఎంతో కష్టపడి పని చేశాడని.. అతడికి తన సెన్సిబిలిటీస్ బాగా అర్థమవుతాయని అన్నాడు శేష్. శశికి ఓ పెద్ద బేనర్లో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ తాను అతణ్ని లాక్కొచ్చి ‘మేజర్’ సినిమా చేయిస్తున్నట్లు శేష్ తెలిపాడు.

ఈ సినిమా చిత్రీకరణం 40 శాతం దాకా పూర్తయిందని.. సినిమా బాగా వస్తోందని శేష్ తెలిపాడు. ఈ చిత్రాన్ని సమాంతరంతగా తెలుగుతో పాటు హిందీలోనూ చిత్రీకరిస్తున్నామని.. దీని తర్వాత ‘గూఢచారి-2’ ఉంటుందని శేష్ తెలిపాడు. ప్రస్తుత లాక్ డౌన్ టైంలో తాను ‘గూఢచారి-2’ స్క్రిప్టు మీద పని చేస్తున్నట్లు అతను వెల్లడించాడు.

Exit mobile version