ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మల్టీస్టారర్స్ అంటే బాబోయ్ దేవుడా అంటున్నాడు

ఆరెక్స్ 100 వంటి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు దర్శకుడు అజయ్ భూపతి. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 30 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. నిర్మాతలకు దాదాపు మూడింతల లాభాలు తీసుకొచ్చిన చిత్రమిది. అలాంటి సినిమాతో పరిచయమైన దర్శకుడికి రెండో సినిమాకు భారీ నిర్మాణ సంస్థలు అవకాశాల కోసం పోటీపడాలి. అయితే అలా జరగలేదు.

తన మొదటి సినిమా విడుదలై రెండేళ్లు కావోస్తోన్నా కానీ ఇంకా రెండో సినిమాను సెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు ఈ దర్శకుడు. దీనికి ఒకటే కారణముంది. తన రెండో సినిమాను ఒక మల్టీ స్టారర్ గా తెరకెక్కించాలనుకున్నాడు ఈ దర్శకుడు. ఏడాది పాటు కష్టపడి మహా సముద్రం అనే స్క్రిప్ట్ ను రాసుకున్నాడు.

ఈ సినిమాకు ఇద్దరు హీరోలు కావాలి. సరిగ్గా ఇక్కడ మొదలైంది మన దర్శకుడికి తిప్పలు. ఎంతో మంది హీరోలను తన స్క్రిప్ట్ పట్టుకుని కలిసాడు. రవితేజ దగ్గరనుండి మొదలుపెట్టి పదుల సంఖ్యలో యంగ్ హీరోలను ఈ సినిమా కోసం అనుకున్నాడు. అయితే ఎవరూ సెట్ కాలేదు. ఒక పాత్రకు శర్వానంద్ ముందుకొచ్చాడు. మరి రెండో పాత్ర సంగతి? నెలలు కావొస్తున్నా రెండో పాత్రకు ఇంకా ఎవరు సెట్ కాలేదు. కొన్ని రోజుల కిందట ఈ సినిమా కోసం సిద్ధార్థ్ ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇందులో నిజమెంతుందో మాత్రం తెలియదు.

అయితే ఈ సినిమా సెట్ చేసుకోవడానికి దర్శకుడు ఇబ్బందులు పడి చివరికి ఫ్రస్ట్రేట్ అయినట్టున్నాడు అందుకే తన కెరీర్ లో ఇదే మొదటి, చివరి మల్టీస్టారర్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంటర్వ్యూలలో మంచి కథతో వస్తే ఏ హీరోతో అయినా మల్టీస్టారర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే మన హీరోలు అసలు విషయంలోకి వచ్చేసరికి ఇలా ముఖం చాటేయడం ఏమాత్రం బాగోలేదు.

Exit mobile version