ఆఖరికి కరోనా వంటి విపత్తు వేళ కూడా తప్పుడు ప్రచారాల ద్వారా తమ హీరోల గ్రాఫ్ ను పెంచడానికి, వారేదో దానపరులైనట్టుగా చిత్రీకరించడానికి ఈ అభిమానులు వెనక్కు తగ్గడం లేదు. ఇలాంటి విపత్తు సమయంలో, లాక్ డౌన్ బాధితులను కూడా తప్పుడు ప్రచారాల కోసం వీరు వాడుకుంటున్నారు. ఏ మాత్రం మనసు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలాంటిదే బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ విషయంలోనూ జరిగింది.
ఆ హీరో లాక్ డౌన్ వల్ల ఉపాధి లేకుండా పోయిన వారికి భారీగా సాయం చేస్తున్నట్టుగా పిచ్చి ఫ్యాన్స్ ఎవరో తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆ ప్రచారంలో పీక్స్ ఏమిటంటే.. ఈ హీరో లాక్ డౌన్ వల్ల పని లేకుండా పోయిన కార్మికుల ఇళ్లకు బియ్యం కవర్లను అందించారని, ప్రతి బియ్యం కవర్ లోనూ 15 రూపాయల డబ్బును కూడా పెట్టి పంచారని, వాటిని తీసుకున్న కార్మికులు అందులోని డబ్బును చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారానికి తెరతీశారు కొంతమంది
ఆ హీరోపై అభిమాన పిచ్చి ముదిరిన వాళ్లు మొదలుపెట్టిన ఈ తప్పుడు ప్రచారం ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది, ఇది నిజం అనుకుని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కథనాలను రాసింది. అయితే అది తప్పుడు ప్రచారం అని తేలిపోయింది. తన దగ్గర అలా సంచులకొద్దీ డబ్బులు లేవని, తానేం రాబిన్ హుడ్ కాదని.. స్వయంగా ఆమిర్ ఖాన్ ట్వీట్ చేశాడు. తనపై జరుగుతున్న వీరాభిమానపు తప్పుడు ప్రచారానికి ఆయనే తెరదించే ప్రయత్నం చేశారు. ఇదంతా చూశాకా.. సినీ హీరోల అభిమానం అనే మూర్ఖత్వంలో మునిగిపోయిన గొర్రెలను ఏమనాలో!