‘చంద్రబాబు వల్లనే ఈ కష్టం..’ అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్.. తీవ్రంగా గుస్సా అవుతున్నారు. అదే సమయంలో, ‘కేంద్రం, పోలవరం ప్రాజెక్టుకి సహకరిస్తోంది..’ అని చెబుతున్నారు. ఇంకోపక్క కేంద్రం, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకీ, జనాన్ని వైసీపీ, టీడీపీ, బీజేపీ ఎందుకు ఆటపట్టిస్తున్నాయి.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.
కేంద్రం, పోలవరం ప్రాజెక్టుకి సహకరిస్తున్నప్పుడు నిధుల సమస్య లేనట్టే. అలాంటప్పుడు, కేంద్ర ఆర్థిక మంత్రి పరుగు పరుగున రెండు మూడు సార్లు ఢిల్లీకి వెళ్ళి, ఆయాసంగా చంద్రబాబుని ఎందుకు ఢిల్లీ నుంచే తిట్టిపోసినట్టు.? పోలవరం ప్రాజెక్టుకి రావాల్సి నిధుల విషయమై కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు ఘాటుగా లేఖ రాసినట్లు.?
‘పోలవరం జాతీయ ప్రాజెక్టు.. కేంద్రమే ఆ ప్రాజెక్టు చేపడతామంటే, మాకు అభ్యంతరం లేదు..’ అంటూ పలువురు మంత్రులు ఎందుకు వ్యాఖ్యానించినట్లు.? అసలు పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడంలేదాయె. మంత్రి అనిల్ ఈ రోజు పోలవరం ప్రాజెక్టుని సందర్శించేశారు. షరామామూలుగానే చంద్రబాబుని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారాయన.
చంద్రబాబు తప్పు చేస్తే, ప్రశ్నించాల్సిందే.. దోపిడీకి పాల్పడితే, శిక్షించాల్సిందే. కానీ, ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అక్కడ అవినీతి జరిగిందని ఏడాదిన్నర కాలంలో అటు కేంద్రంగానీ, ఇటు రాష్ట్రంగానీ తేల్చలేదంటే అర్థమేంటి.? వైసీపీ – బీజేపీ – టీడీపీ కుమ్మక్కయ్యాయనే కదా.! ‘నువ్వు తిట్టినట్టు నటించి.. నేను ఏడ్చినట్లు నటిస్తాను..’ అన్నట్టుంది వ్యవహారం.
కేంద్రం సహకరించాల్సిన రీతిలో సహకరించి వుంటే, 2018 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయపోయి వుండాలి. చంద్రబాబు, చిత్తశుద్ధితో వ్యవహరించి వుంటే.. ఆ డెడ్‌లైన్ పూర్తయ్యేనాటికి ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చేది. వైఎస్ జగన్ సర్కార్‌కి చిత్తశుద్ధి వుండి వుంటే, అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రాజెక్టు పూర్తయిపోయేది. సో, ఇక్కడ చిత్తశుద్ధి ఎవరికి లేదన్నదానిపై పూర్తి స్పష్టత రాష్ట్ర ప్రజానీకానికి వుందన్నది నిర్వివాదాంశం. ప్రాజెక్టు ఎత్తు తగ్గబోదని, నీటి నిల్వ తగ్గబోదని మంత్రి అనిల్ ఈరోజు ప్రకటించడం ఈ వివాదానికి సంబంధించి కాస్త ఊరట.