గతేడాది ‘నిశబ్దం’ సినిమా – ఈ ఏడాది ‘పిట్టకథలు’ వెబ్ సిరీస్ చేసినప్పటికీ శ్రీనివాస్ అవసరాల కు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. అలానే దర్శకుడిగా నాగశౌర్యతో అప్పుడెప్పుడో మొదలుపెట్టిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఎప్పుడు తిరిగి సెట్స్ మీదకు వెళ్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. అందుకే ఇప్పుడు అవసరాల తన గురించి ఇండస్ట్రీలో తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ”నూటొక్క జిల్లాల అందగాడు” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల హీరోగా నటించడమే కాకుండా.. కథ కూడా అందించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ – ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శిరీష్ – వై.రాజీవ్ రెడ్డి – జె.సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 3న ఈ సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు – క్రిష్ జాగర్లమూడి సమర్పిస్తున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి కలుగుతోంది.
బట్టతల ఉన్న ఓ యువకుడి ప్రేమ కష్టాల నేపథ్యంలో చాలా సరదాగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. హిందీలో ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన ‘బాలా’ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో బట్టతల గొత్తి సూర్య నారాయణ గా శ్రీనివాస్ అవసరాల తనదైన శైలిలో అలరించబోతున్నారని అర్థం అవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది. మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.
దీనికి తోడు ఈ శుక్రవారం విడుదలయ్యే చిత్రాల్లో ‘డియర్ మేఘ’ మినహా మరో చెప్పుకోదగ్గ సినిమా లేదు. గతవారం రిలీజైన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ మాత్రమే తదుపరి వారంలో కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇవి ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేదనే చెప్పాలి. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మంచి ఓపెనింగ్స్ రాబట్టడమే కాకుండా.. అవసరాల శ్రీనివాస్ కు హీరోగా మంచి సక్సెస్ అందుతుంది. ఇదే జరిగితే టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ మళ్ళీ క్రేజ్ తెచ్చుకోవడం ఖాయం. మరి ప్రేక్షకులు ఈ సినిమాకి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.