ఆ సినిమా చూసి ఒక్కో ప్రేక్షకుడు పొందిన అనుభూతి గురించి ఏం చెప్పాలి? బహుశా భారతీయ సినీ ప్రేక్షకులకు అలాంటి కామన్ ఎమోషన్ తెచ్చిన సినిమా ఇప్పటిదాకా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే లేదంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ చిత్రం ప్రకంపనలు రేపింది. ఎన్నో దేశాల్లో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. వసూళ్ల మోత మోగించింది. జపాన్ లాంటి దేశాల్లో అయితే బాహుబలి క్రేజ్ పతాక స్థాయికి చేరి రాజమౌళి, ప్రభాస్ లాంటి వాళ్లు అక్కడ సూపర్ స్టార్లుగా మారిపోయారు.
ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలై మూడేళ్లు దాటినా ఇంకా ఆ సినిమా సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రష్యాలో ‘బాహుబలి-2’ను టీవీల్లో ప్రసారం చేశారు. అది కూడా రష్యన్ భాషలో కావడం విశేషం. అక్కడి ప్రేక్షకులు అమితాసక్తితో ఈ చిత్రాన్ని చూస్తూ మన ప్రేక్షకుల్లాగే భావోద్వేగాలకు గురవుతున్నారు. ఓ రష్యన్ ఛానెల్లో రష్యన్ భాషలో ‘బాహుబలి-2’ ప్రసారమవుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
దేవసేన మీద మహిష్మతి సభలో విచారణ జరిగే సన్నివేశంలో రష్యన్ భాషలో డైలాగులు విని మనోళ్లు ఆశ్చర్యపో్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ముందు నుంచే పాపులర్ అయిన హిందీ సినిమాలు కూడా రష్యన్ భాషలో అనువాదమై ఇలా టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యుంటాయా అంటే సందేహమే. ఇది మన తెలుగు సినిమాకు దక్కిన గౌరవంగా భావించాలి. రాజమౌళి అయినా సరే.. ఇలాంటి మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయగలడా అంటే సందేహమే.