తన తండ్రి జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ గురువారం నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తెలుగు సినీ పెద్దల సమావేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లు ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి నిమిత్తం ఈ నెల 22న కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో చిత్ర పరిశ్రమ ప్రముఖులు సమావేశమైన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సినిమా థియేటర్ల పునః ప్రారంభం తదితర అంశాలపై కేసీఆర్‌తో చర్చించారు. అంతకు ముందు సినిమాటోగ్రఫీ మంత్రి తలసానితో కూడా చిరంజీవి ఇంట్లో చిత్ర పరిశ్రమ పెద్దలు సుదీర్ఘ చర్చ జరిపారు. మంత్రితో ఒకట్రెండు వరుస భేటీలు జరిపిన విషయం తెలిసిందే.
కేసీఆర్‌తో సమావేశమైన వాళ్లలో అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు డి.సురేష్‌బాబు, సి.కళ్యాణ్, అల్లు అరవింద్, దిల్‌రాజ్, దామోదర ప్రసాద్, కిరణ్, దర్శకులు రాజమౌళి, ఎన్.శంకర్, మెహర్ రమేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాధాకృష్ణ, కొరటాల శివ తదితరులు ఉన్నారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో సినిమా పెద్దలు సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదని బాలకృష్ణ చెప్పడం చర్చనీయాంశమైంది. అంతేకాదు , ఈ విషయాన్నిపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుసుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమలో ప్రముఖుల మధ్య విభేదాలు మరోసారి బాలకృష్ణ మాటలు బహిర్గతం చేశాయని టాలీవుడ్‌లో తీవ్ర చర్చ నడుస్తోంది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బాలకృష్ణ పరుష పదజాలంతో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో సమావేశానికి బాలకృష్ణను ఆహ్వానించకపోవడం గమనార్హం.