ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బండి సంజయ్‌ అత్యుత్సాహం: పాత బస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌!

పాత బస్తీ విషయమై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా, ‘బీజేపీ గెలిస్తే, పాత బస్తీలో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తాం..’ అంటూ బండి సంజయ్‌ సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్జికల్‌ స్ట్రైక్‌ చేయడానికి అదేమన్నా పాకిస్తాన్‌లో వుందా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పాకిస్తాన్‌ మీద మిరేజ్‌ యుద్ధ విమానాలతో సర్జికల్‌ స్ట్రైక్‌ చేశారు.. పాత బస్తీపైకి రఫాలె యుద్ధ విమానాల్ని ఉసిగొల్పుతారా.? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బీజేపీ మీద.

అయితే, పాత బస్తీ విషయమై మజ్లిస్‌ నేతల వ్యాఖ్యలు కూడా అత్యంత వివాదాస్పదమవుతున్నాయి. ‘తెలంగాణకి కేసీఆర్‌ సీఎం కావొచ్చు.. పాత బస్తీకి మాత్రం అసదుద్దీన్‌ ఒవైసీనే సీఎం.. కేటీఆర్‌ ఓ పిల్ల బచ్చా.. పాత బస్తీలో అడుగు పెట్టాలంటే, కేటీఆర్‌కి అయినా అసదుద్దీన్‌ ఒవైసీ అనుమతి వుండాలి..’ అంటూ మజ్లిస్‌ ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసిన దరిమిలా, బండి సంజయ్‌ ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’ వ్యాఖ్యలకు ఒకింత మద్దతు కూడా లభిస్తుండడం గమనార్హం.

అయితే, మజ్లిస్‌ నేతలు చేస్తున్న విమర్శలపై టీఆర్‌ఎస్‌ నేతలకు గట్టిగా నోరు పెగలని పరిస్థితి. ఒకరిద్దరు టీఆర్‌ఎస్‌ నేతలు తూతూ మంత్రంగా విమర్శిస్తున్నా, మజ్లిస్‌ని నిజంగానే విమర్శించేంత సీన్‌ మాత్రం టీఆర్‌ఎస్‌కి లేదన్నది నిర్వివాదాంశం. అలా మజ్లిస్‌ తీరు నచ్చని ఓటు బ్యాంకుని తమ ఖాతాలో వేసుకునే ఉద్దేశ్యంతోనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్ళి మరీ, పాత బస్తీపైనా, మజ్లిస్‌పైనా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

మొన్నటికి మొన్న, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కి కూడా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని బండి సంజయ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. గ్రేటర్‌ ఎన్నికల వేళ ఈ తరహా రాజకీయ విమర్శలు సర్వసాధారణమైపోవడం అత్యంత బాధాకరమైన విషయం. హైద్రాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని బీజేపీ, టీఆర్‌ఎస్‌ దెబ్బకొడ్తున్నాయన్న వాదనలు ఇతర రాజకీయ పార్టీల నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.

Exit mobile version