గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ.. అధికార పార్టీలో గుబులు స్పష్టంగా తెలుస్తోంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపుతో దూకుడుగా ఉన్న బీజేపీ.. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని గ్రేటర్ లో మరింత బలం సంతరించుకోవాలని యోచిస్తోంది. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చాలా దూకుడు కనబరుస్తున్నారు. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇవి ఏదో అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. కావాలనే ఆయన అలా మాట్లాడారని అంటున్నారు.
ఇప్పటికే గ్రేటర్ పోరులో మతం కీలకమైన అంశంగా మారింది. అభివృద్ది నినాదం పక్కకు పోయి మతం చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. బీజేపీ వేసిన ఈ వ్యూహాత్మక ఎత్తుగడలో గులాబీ పార్టీ చిక్కుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికే యూపీ సీఎం యోగి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా వస్తున్నారంటే ఈ పోరును కమలనాథులు ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వస్తారనే ప్రచారం సాగుతోంది. ఓ వైపు కిషన్ రెడ్డి కూడా శక్తివంచన లేకుండా బీజేపీ విజయానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ లబ్ధి తలా కొంచెం అందరికీ పోతుంది. ఈ విషయాన్ని పసిగట్టడం వల్లే ‘బండి’ దూకుడు పెంచారని అంటున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం సవాల్ చేయడమే కాకుండా అక్కడకు వెళ్లి హీట్ పెంచిన ఆయన.. తాజాగా పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తానని చెప్పడం ఇందులో భాగమేనని తెలుస్తోంది.
దీనిపై అటు కేటీఆర్, ఇటు అసద్ కూడా స్పందించి ప్రతిసవాళ్లు చేశారు. దీంతో గ్రేటర్ రాజకీయం మరింత హీటెక్కింది. నిజానికి బండి కోరుకుంది కూడా ఇదేనని అంటున్నారు. తన వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లడం.. వాటిపై చర్చ జరగడం.. దేశభక్తి.. హిందూయిజం వంటి పలు అంశాలతో పార్టీకి లబ్ధి చేకూరడంతోపాటు పార్టీలో తన స్థానానికి తిరుగు ఉండదనే ద్విముఖ వ్యూహం ఈ దూకుడులో కనిపిస్తోందని చెబుతున్నారు. మొత్తానికి గ్రేటర్ ఫైట్ లో బండి రూట్ దూకుడుగానే వెళ్తోంది.