‘భీమ్లా నాయక్’ చిత్రానికి బెనిఫిట్ షో – అదనపు షోలు వేయడానికి అనుమతి లేదని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా సినిమా టికెట్ రేట్లు కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఉండాలని పేర్కొన్నారు. థియేటర్లపై రెవెన్యూ అధికారులు నిఘా ఉంటుందని పేర్కొంటూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏపీ సినిమాటోగ్రఫీ చట్టం-1952 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆదేశాల్లో వెల్లడించారు.
ఈ నేపథ్యంలో సినిమా థియేటర్ యజమానులను బెదిరిస్తూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆరోపించింది. రేపు విడుదల కానున్న ‘భీమ్లా నాయక్’ చిత్రానికి సంబంధించి రద్దు చేయబడిన జీవో నెం. 35 ప్రకారం టికెట్లు విక్రయించాలని ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తేవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఫిల్మ్ ఛాంబర్ గౌరవ కార్యదర్శి ప్రసన్నకుమార్ – నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘భీమ్లా నాయక్’ సినిమాకు హైకోర్టు సస్పెండ్ చేసిన జీవో ప్రకారం టికెట్ ధరలను ఎలా నిర్ణయిస్తారని ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ప్రశ్నించారు. ఈ విషయంలో కొందరు రాజకీయ నాయకులు కావాలనే ఏపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని జీవో 35 కంటే ముందున్న జీవో నెం. 100 ప్రకారమే టికెట్ ధరలు ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
దయచేసి హైకోర్టు సస్పెండ్ చేసిన జీవో 35 ప్రకారం టికెట్ రేట్లు ఉండాలని ఎగ్జిబిర్స్ ను ఇబ్బంది పెట్టవద్దు అని నట్టి కుమార్ విజ్ఞప్తి చేసారు. సినిమా సినిమాగానే చూడమని అధికారులకు సూచించాలని సీఎం జగన్ ను కోరారు. నటీనటులకు వివిధ రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నా.. సినీ ఇండస్ట్రీ వరకు వచ్చే సరికి సినిమానే ప్రాధాన్యత ఉంటుందని ప్రసన్నకుమార్ తెలిపారు.