ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బిచ్చగాడు సీక్వెల్ అనౌన్స్ చేసిన విజయ్ ఆంటోనీ

తెలుగులో డబ్ అయిన చిత్రాల్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అనే కేటగిరీ ఉంటే అది కచ్చితంగా విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమాకే వర్తిస్తుంది. చాలా పరిమిత బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. తెలుగులో మాత్రం ఈ సినిమా రికార్డులను తిరగరాసిందనే చెప్పాలి. దాదాపు 18 కోట్ల షేర్ ను ఈ సినిమా వసూలు చేయడం విశేషం. పెట్టిన పెట్టుబడికి దాదాపు పదింతలు లాభం ఈ చిత్రంతో వచ్చింది.

ఒక డబ్బున్న వ్యక్తి అమ్మ కోసం బిచ్చగాడిగా నటించడమనే కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమాలో సెంటిమెంట్ కూడా అదే స్థాయిలో పండడంతో తిరుగులేకుండా పోయింది. వెండితెర మీదే కాదు, బుల్లితెర మీద కూడా ఈ చిత్రానిదే హవా. మొదటిసారి ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేసినప్పుడు రికార్డ్ టిఆర్పి నమోదైంది. తెలుగులో సూపర్ హిట్ బడా స్టార్ల చిత్రాలు కూడా ఇంత టిఆర్పిలను చేజిక్కించుకోలేక పోతున్నాయి.

ఇప్పుడిదంతా ఎందుకంటే విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ ను ప్రకటించాడు. ఎప్పటినుండో ఈ చిత్రానికి సీక్వెల్ పై వార్తలు వస్తున్నాయి. ఈరోజు విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. విజయ్ ఆంటోనీ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తారు. మిగతా వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Exit mobile version