ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రివర్స్‌ గేర్‌: మద్యం అమ్మకాలతో కేంద్రానికేంటి సంబంధం.?

బీజేపీ నేతలు తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారోగానీ.. ఒక్కోసారి అర్థం పర్థం లేకుండా మాట్లాడేస్తారు. ఎవర్నో మభ్యపెట్టాలనే ప్రయత్నంలో బుకాయింపులకు దిగడం బీజేపీ నేతలకు కొత్త కాదు. మరీ ముఖ్యంగా, ఏపీ బీజేపీ నేతలు ఈ విషయంలో పలుమార్లు బొక్కబోర్లా పడ్డారు.

తాజాగా, మద్యం అమ్మకాల వ్యవహారంపై బీజేపీ సీనియర్‌ నేత ఒకరు, ‘రాష్ట్రం మద్యం దుకాణాల్ని తెరిస్తే, కేంద్రానికి ఏంటి సంబంధం.?’ అని ప్రశ్నించేశారు. నిన్నటికి నిన్న ఓ మంత్రిగారు, ‘కేంద్రం మద్యం దుకాణాలు తెరవాలని చెప్పింది.. అందుకే మద్యం దుకాణాల్ని తెరిచాం..’ అని సెలవిచ్చారు.

నిజమే, కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది లాక్‌డౌన్‌ నుంచి. అయితే, రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం, నలభై రోజులకు పైగా లాక్‌డౌన్‌తో, అనుకోకుండా కలిసొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ, ఆ పని చేయలేదు. పైగా, మద్యం ధరలు పెంచి, ఖజానాని నింపుకుంటూ, మద్య నియంత్రణలో ఇదో కీలకమైన అడుగు అని ప్రచారం చేసుకుంటోంది. తీరా, విమర్శలొచ్చేసరికి.. కేంద్రం తెరవమని చెప్పిందంటూ మద్యం షాపులు తెరవడంపై నెపాన్ని కేంద్రం మీద నెట్టేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నప్పుడు, అది పరోక్షంగా తెలంగాణకు ఇబ్బందికరం. దాంతో తెలంగాణ కూడా మద్యం దుకాణాల్ని తెరవక తప్పలేదు. ఎలా చూసినా, ఈ వ్యవహారంలో రాష్ట్రాల ‘కాసుల కక్కుర్తి’, కేంద్రం అవివేకం.. రెండూ కలిసే లిక్కర్‌ షాపులు తెరవడానికి కారణం. ‘మద్యం అమ్మకాలతో మాకేటి సంబంధం.?’ అని ప్రశ్నిస్తున్న ఏపీ బీజేపీ నేతలు, అసలు కేంద్రమెందుకు ఆ ప్రకటన చేసిందో చెప్పలేకపోతున్నారు.

స్కూళ్ళు తెరవట్లేదు, ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాల్నీ తెరవట్లేదు.. కానీ, మద్యం దుకాణాల్ని తెరిచేందుకు అనుమతిచ్చేసింది కేంద్రం. ఏమన్నా అంటే, ‘అది కేంద్రానికి సంబంధించిన విషయం.. మా పార్టీకి సంబంధించిన విషయం కాదు’ అని బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు ‘కవరింగ్‌’ ఇస్తారేమో.!

Exit mobile version