ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కరోనా కక్కుర్తి: ఈ బ్లీచింగ్‌ పౌడర్‌ స్కామ్ గోలేంటి.!

కరోనా వైరస్‌ ఓ పక్క ప్రపంచాన్ని వణికిస్తోంటే, ఆ కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు వినియోగిస్తోన్న బ్లీచింగ్‌ పౌడర్‌ కొనుగోళ్ళలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్లీచింగ్‌ పౌడర్‌ స్థానంలో మామూలు సున్నాన్ని కలిపేసి అమ్మేశారనీ, కొందరు అధికారులు ‘క్వాలిటీ’ చూసుకోకుండా కొనుగోలు చేశారనీ వెరసి 70 కోట్ల మేర బ్లీచింగ్‌ పౌడర్‌ పేరుతో స్కామ్ జరిగిందనీ ప్రచారం జరుగుతోంది.

గుంటూరు జిల్లా కేంద్రంగా వెలుగు చూసిన ఈ బ్లీచింగ్‌ పౌడర్‌ స్కామ్ ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో తీగ లాగితే, డొంక గుంటూరు జిల్లాలో కదిలినట్లు తెలుస్తోంది. అసలు బ్లీచింగ్‌ పౌడర్‌ తయారు చేసే పరిశ్రమ ఏదీ లేకుండానే గుంటూరు జిల్లాకి చెందిన ఓ సంస్థ నుంచి పెద్దయెత్తున బ్లీచింగ్‌ పౌండర్‌ని కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చేశారట అధికారులు. ఓ జిల్లాలో ఉన్నతాధికారి ఒకరు బ్లీచింగ్‌ పౌడర్‌లో నాణ్యత గురించి పరిశీలించడంతో బాగోతం వెలుగుచూసిందని అంటున్నారు. మొత్తం నాలుగు జిల్లాలకు ఇప్పటికే ఈ ఫేక్‌ బ్లీచింగ్‌ పౌడర్‌ సరఫరా అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది.

‘బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే కరోనా వైరస్‌ చచ్చిపోతుంది’ అన్నది కొంతవరకు నిజమే అయినా, దానికోసం ఫేక్‌ బ్లీచింగ్‌ పౌండర్‌ని వినియోగించాల్సి రావడమే దురదృష్టకరం. అందుగలడిందులేదని సందేహము వలదు.. ఎందెందుకు వెతికినా స్కామ్ తప్పదయా.. అన్నట్టుంది వ్యవహారం. ప్రభుత్వ పెద్దలు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని, బాధ్యుల్ని కటకటాల వెనక్కి పంపుతారా.?

అధికార పార్టీ నేతలకు ఈ స్కావ్‌ులో ప్రమేయం వుందంటూ ఆరోపణలు వస్తున్న దరిమిలా లైట్‌ తీసుకుంటారా.? ఏమవుతుందోగానీ.. కరోనా వైరస్‌ని కూడా స్కామ్ ల కోసం వాడేస్తున్న తీరు చూస్తోంటే నవ్వాలో ఏడవాలో తెలియని దుస్థితి నెలకొంది రాష్ట్ర ప్రజానీకానికి.

Exit mobile version