ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బొత్సకు అల్లుడి గిల్లుడు…?

ఉత్తరాంధ్రాలో సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరంటే మంత్రి బొత్స సత్యనారాయణ పేరు చెప్పాల్సిందే. ఆయనది మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితం. దివంగత నేత మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు శిష్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బొత్స ఆ తరువాత తనదైన వ్యూహ చతురతతో అంచెలంచెలుగా ఎదిగి గురువుని మించారన్న పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఏపీలో అనేక కీలక శాఖలకు మంత్రిగా చేసిన బొత్స పీసీసీ చీఫ్ గా కూడా దర్జా చూపించారు. ముఖ్యమంత్రి సీటుకు ఒక అడుగు దూరంలో మిగిలిపోవడం రాజకీయంగా బ్యాడ్ లక్ అయితే కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరి మళ్లీ తన రాజకీయ పట్టుని నిలుపుకున్న చాణక్యం బొత్సదే.

విజయనగరం రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్న బొత్స కు కులం కుటుంబమే అతి పెద్ద బలం. తాను జిల్లాలో ఉన్నా లేకున్నా మొత్తం రాజకీయ వ్యవహారలను చక్కబెట్టే నేర్పు ఓర్పున్న మేనల్లుడు చిన్న శ్రీను ఉండడం బొత్సకు వరమైంది. కుడి భుజం లాంటి మేనల్లుడి అండతో ఆయన జిల్లా రాజకీయాల్లో చక్రం గిర్రున తిప్పేసేవారు. అయితే ఇపుడు అదే చక్రం తనకే అడ్డు తగుల్తోందని టాక్. బొత్సకు చిన్న శ్రీనుకు విభేదాలు స్టార్ట్ అయ్యాయని ప్రచారం అయితే జిల్లా రాజకీయాల్లో గుప్పుమంటోంది. చిన్న శ్రీను మేనమామ బొత్స మాదిరిగానే రాజకీయ చతురుడు. మామ వెన్నంటే ఉంటూ ఆయన మొత్తం రాజకీయాలను ఆకలింపు చేసుకున్నాడు.

ఇపుడు జిల్లా పరిషత్ చైర్మన్ కాగానే తనదైన హవాను చూపిస్తున్నారని అంటున్నారు. పైగా ముఖ్యమంత్రి జగన్ కి కూడా చిన్న శ్రీను మీద ప్రత్యేక అభిమానం ఉంది. జగన్ విజయనగరం జిల్లాలో చేసిన పాదయాత్రలో మొత్తం కలసి నడచిన వారు చిన్న శ్రీను. నాడే జగన్ కి బహు ఇష్టుడు అయ్యాడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తాను పోటీ చేయమని జగనే చిన్న శ్రీనుకు ఆఫర్ ఇచ్చారని కూడా ప్రచారంలో ఉంది. అయితే పార్టీ విజయం కోసం పనిచేస్తానని చెప్పి జగన్ వద్ద మార్కులు కొట్టేసిన చిన్న శ్రీను దాని ఫలితంగానే ఈ రోజు జిల్లాకే అతి పెద్ద పదవి అయిన పరిషత్ చైర్మన్ గా కుదురుకున్నారు.

ఇక విజయనగరం కార్పోరేషన్ లో కూడా ఆయన అనుచరులే ఉన్నారు. బొత్సకు తలలో నాలుకగా ఒకనాడు మెలిగిన చిన్న శ్రీను ఇపుడు సొంత రాజకీయం చూసుకోవడమే కాదు జిల్లాలో తనదైన దూకుడుని కూడా చూపిస్తున్నారు. బొత్సతో దశాబ్దాల విరోధం ఉన్న ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో చెట్టాపట్టాల్ వేస్తున్నారు. అలాగే నెల్లిమర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పక్షం వహించి ఏకంగా బొత్స తమ్ముడు లక్షణరావుకు అక్కడ చెక్ పెట్టేసేలా చిన్న శ్రీను చేస్తున్న రాజకీయ మంత్రాంగం పెద్దాయనకు గిట్టనిదైందిట. ఇక లేటెస్ట్ గా జిల్లాలో ఒక ఎమ్మెల్సీ పదవిని జగన్ ఇస్తే దాన్ని తన అనుచరుడిగా ఉన్న ఎస్ కోట కీలక నేత ఇందుకూరి రఘురాజుకు ఇప్పించుకోవడం ద్వారా జిల్లా మంత్రిని సైడ్ చేసేశారు అన్న టాక్ కూడా నడుస్తోంది.

నిజానికి బొత్స చాలా కాలంగా రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై జిల్లా పాలిటిక్స్ ని చిన్న శ్రీనుకు వదిలేశారు. దాంతో పార్టీ జనాలు బయట జనాలతో చిన్న శ్రీనుకే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. ఇపుడు ఆయన వాటిని చక్కగా వాడుకుంటున్నారు. దాంతో బొత్స ఏం చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు. చూడబోతే మేనల్లుడి రాజకీయ గిల్లుడికి బొత్స మార్క్ పాలిటిక్స్ తారుమారు అయ్యేలా ఉందని వైసీపీలోనే గట్టిగా వినిపిస్తున్న మాట.

ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. వైసీపీ హై కమాండ్ కి కూడా బొత్సను సైడ్ చేయాలని ఉంది. దాంతో కావాలనే చిన్న శ్రీనును దువ్వుతున్నారని వారి అండదండలతోనే అల్లుడు ఇలా మామ మీదకే తన రాజకీయాన్ని ప్రయోగించారు అంటున్నారు. ఇదే సీన్ కొనసాగితే చిన్న శ్రీను జిల్లా రాజకీయాల్లో బొత్స ప్లేస్ ని ఆక్రమిస్తారని కూడా అంటున్నారు. మరి దీనికి రిటార్ట్ గట్టిగానే బొత్స సైడ్ నుంచి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Exit mobile version