కొన్నాళ్ళ క్రితం వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రంలో విగ్రహాల కూల్చివేత, రధాల దగ్ధం గురించి మాట్లాడుతూ, ‘రథాల్ని తగలబెట్టినవాళ్ళే రధయాత్రలు చేస్తున్నారు.. విగ్రహాల్ని ధ్వంసం చేసినవారే.. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు..’ అంటూ విమర్శించారు. అధికారంలో వున్నది వైసీపీనే. కుట్రలకు పాల్పడుతున్నదెవరో అధికార పార్టీ దగ్గర, అందునా ముఖ్యమంత్రి దగ్గరా, మంత్రుల దగ్గరా సమాచారం వుంటే, ఎంచక్కా కుట్రదారుల్ని అరెస్ట్ చేసేసి లోపలేసెయ్యాలి. కానీ, అలా జరగడంలేదు రాష్ట్రంలో. ఏదో సరదాకి.. అన్నట్టు మీడియా ముందుకొచ్చి నాలుగు విమర్శలు చేసి పోవడం ప్రభుత్వ పెద్దలకు ఓ అలవాటుగా మారిపోయిందన్న విమర్శలు సాధారణ ప్రజానీకం నుంచి వినిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగానే వున్నాయి.
పదో తరగతి విద్యార్థులు.. పరీక్షలొద్దు మొర్రో.. అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో, ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.. వైద్యం అందక బాధితులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితినీ చూస్తున్నాం. వాటిపై విపక్షాలు మాట్లాడితే, ‘అగ్గిపెట్టె పట్టుకుని తగలబెట్టెయ్యడానికి సిద్ధంగా వున్నారు’ అని ఓ మంత్రి అనడమేంటి.? ఆరోపణకు తగ్గ ఆధారాలుంటే, ప్రభుత్వ పెద్దలు, కుట్రదారుల్ని అరెస్ట్ చేయాలి ఇకనైనా. అది చేతకానప్పుడెందుకీ టైమ్ పాస్ విమర్శలు.? ఇదిలా వుంటే, ఈ రోజు.. కొత్తగా రాష్ట్రంలో 74,041 టెస్టులు చేయగా 9881 కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. చిత్రమేంటంటే, ముందు రోజు.. అంటే నిన్న, 62,885 టెస్టులు చేస్తే 12,634 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం. టెస్టుల సంఖ్య పెరిగితే పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగానే పెరుగుతాయి. కానీ, ఇక్కడ దాదాపు 3 వేల కేసులు పెరిగాయి.. 12 వేల టెస్టులు పెరిగితే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏమో.!