అక్కడెక్కడో విశాఖలో ఏదో గెస్ట్ హౌస్ కట్టేయడానికి పరుగులు పెడుతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఏం, న్యాయ రాజధాని అంటున్న కర్నూలులో అలాంటిదేదో ప్లాన్ చేయొచ్చు కదా.? అమరావతిలోనూ అలాంటి ప్రయత్నం చేయొచ్చు కదా.! ‘అమరావతి పరిధిలోని 29 గ్రామాల్ని అభివృద్ధి చేస్తాం.. అటు విజయవాడ, ఇటు గుంటూరు నగరాలతో సమానంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది..’ అంటూ బొత్స సత్యనారాయణ ఈ రోజు మీడియా ముందుకొచ్చి తనదైన స్టయిల్లో బుకాయించేశారు.
వారెవ్వా.. రాజకీయం అంటే ఇలా ఉండాలి. కొత్తగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏమీ చేయాల్సిన పనిలేదు. గతంలో చంద్రబాబు మొదలెట్టిన పనుల్లో కొన్నిటినైనా పూర్తి చేస్తే చాలు.. అమరావతి ఇప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలోనే అభివృద్ధి చెందేది. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేయడమో.. కొన్ని మౌళిక సౌకర్యాల్ని కల్పించడమో చేస్తే.. గుంటూరు, విజయవాడ స్థాయిలో కాకపోయినా.. ఓ మోస్తరుగానే అయినా అభివృద్ధి చెందేది.
ఇది రాజధాని కోణంలో చేసినా చేయకపోయినా, అమరావతిని ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా భావించి అయినా చేసి వుండాలి. అంతెందుకు, ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికారులు ఈ అమరావతిలోనే వివిధ పనుల నిమిత్తం తిరుగుతున్నారు గనుక.. వారి అవసరాల మేర అయినా అభివృద్ధి చేసి వుండాల్సింది. ఇవేవీ చేయకుండా స్మశానం అని ఓ సారి, ఎడారి అని ఇంకోసారి, ముంపు ప్రాంతమని మరోసారి.. కల్లబొల్లి కబుర్లు చెబుతూ, ఇప్పుడు సత్తిబాబు ‘అభివృద్ధి మంత్రం’ జపిస్తే నమ్మేందుకు జనం వెర్రి వెంగళప్పలనుకుంటే ఎలా.?