ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఆ అప్పులకీ.. ఈ అభివృద్ధికీ సంబంధమేంటి బుగ్గన సారూ.!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విద్యాధికుడే.. అంతకు మించిన మాటకారి ఆయన. తిమ్మిని బమ్మిని చేయగల మేధావి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందన్నది విపక్షాల ఆరోపణ. ఈ విషయమై టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆధారాలతో సహా కొన్ని ఆరోపణలు చేశారు.

ఏపీఎస్‌డీసీ చేసిన అప్పుల్ని గుట్టుగా వుంచుతున్నారనీ, వాటిని ఏ విధంగా తిరిగి చెల్లిస్తారన్నది చెప్పడంలేదనీ, కొన్ని ఖర్చులకి సరైన లెక్కలూ వుండడంలేదనీ పయ్యావుల కేశవ్ ఆరోపించడమే కాదు, పీఏసీ ఛైర్మన్ హోదాలో రాష్ట్ర గవర్నర్‌కి ఫిర్యాదు కూడా చేశారు. దానిపై ప్రభుత్వం ఇవ్వాల్సిన స్థాయిలో ఇప్పటిదాకా వివరణ ఇచ్చింది లేదు. సర్దుబాట్లు జరిగాయి తప్ప, నిధుల గోల్ మాల్ జరగలేదన్నది ప్రభుత్వ వివరణ. సరే, నిధులేమయ్యాయ్.? అన్నది వేరే చర్చ.

అప్పులైతే కనిపిస్తున్నాయ్. ఆ అప్పులెలా తీరేది.? అన్నదానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వడంలేదు. ఇక, ఈ వ్యవహారంపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ, అమ్మ ఒడి, మహిళలకు ఆసరా, చేయూత వంటి నాలుగు పథకాల కోసం నిధుల్ని వాడినట్లు చెప్పారు. వాటి కోసమే అప్పులు చేశామనీ సెలవిచ్చారు.

అగ్రిమెంట్లు చదవకుండా, అసెంబ్లీలో తీర్మానాల గురించి తెలుసుకోకుండా పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారన్నది బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపణ. సరే, టీడీపీ – వైసీపీ మధ్య రాజకీయ వైరం సంతి పక్కన పెడదాం. ప్రతిపక్షం మీద అధికార పక్షం, అధికార పక్షం మీద ప్రతిపక్షం ఆరోపణలు చేయడమే. కానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అప్పులు చేసి, ఆ నిధుల్ని సంక్షేమ పథకాల కోసం ఖర్చుపెట్టడమేంటి.? డెవలప్‌మెంట్ అనే పదానికి నిఘంటువుల్లో అర్థాలేమైనా మార్చేశారా.? అన్న అనుమానాలు కలగడం సహజమే.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అప్పులు చేసి, రాజధానికి సంబంధించిన నిర్మాణాలు చేపడితే.. అది అభివృద్ధి. పోనీ, ఓ ప్రాజెక్టు కోసం నిధులు ఖర్చు చేస్తే అదీ అభివృద్ధి. కానీ, రాష్ట్రంలో అసలు అభివృద్ధి అన్న మాటకే ఆస్కారం లేకుండా పోయింది. వాలంటీర్ల పేరుతో అధికార పార్టీ మద్దతుదారులకు ఉపాధి కల్పించుకుంటే అది అభివృద్ధి.. అన్నట్టుంది బులుగు పాలన. ఇలాంటి బులుగు పాలనలో ఆర్థిక మంత్రి బుగ్గన నుంచి అభివృద్ధి విషయమై ఇలాంటి చిత్ర విచిత్రమైన బుడగల్లాంటి వివరణలే వస్తాయ్ మరి.

Exit mobile version