విపక్షాలు గగ్గోలు పెట్టినంతమాత్రాన, మీడియా గగ్గోలు పెట్టినంతమాత్రాన.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పుట్టే పరిస్థితి వుండదా.? అలాగని ఎవరైనా ఆలోచిస్తే, అంతకన్నా దిగజారుడుతనం ఇంకోటుండదు. రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి.. అధికార పీఠమెక్కినోళ్ళే రాజకీయం చేస్తున్నప్పుడు, విపక్షాలెందుకు రాజకీయం చేయకూడదు.?
బుగ్గన అనుమతులు పొందింది అప్పు చేయడానికి మాత్రమే. అక్కడికేదో, కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని బుగ్గన తన సమర్థతో సాధించినట్లు వైసీపీ ప్రచారం చేసుకుంటే ఎలా.? విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను ఆపగలుగుతున్నారా.? రైల్వే జోన్ తీసుకురాగలుగుతున్నారా.? ప్రత్యేక హోదా సాధించగలుగుతున్నారా.? అంతెందుకు, పోలవరం ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తాన్ని తిరిగి కేంద్రం నుంచి రప్పించుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం నానా తంటాలూ పడాల్సి వస్తోందాయె.
కరోనా పాండమిక్ పరిస్థితుల్లో రాష్ట్రాలు అప్పు చేయడం వింతేమీ కాదు. కానీ, రాష్ట్రం తాలూకు ఆదాయం పరిస్థితేంటి.? చంద్రబాబు హయాంలో జరిగిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే నానా తంటాలూ పడుతున్నామని స్వయంగా వైఎస్ జగన్ సర్కార్ చెబుతోంది. మరి, చంద్రబాబు సర్కారు ఐదేళ్ళలో చేసిన అప్పుల రికార్డుని, రెండేళ్ళలో దాటేసిన వైఎస్ జగన్ సర్కారుని ఏమనాలి.? జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులకీ, అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులకీ.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కనీసం వడ్డీలైనా కట్టగలిగే స్థితిలో వుంటుందా.?