వైసీపీ పాలనలోని లోటుపాట్లను ఎత్తిచూపినా వాటిని చక్కదిద్దే చర్యలు చేపట్టకుండా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. వైసీపీ నేతల పాలనలో రాష్ట్రానికి వాటిల్లిన కీడు, ప్రజలకు కలిగిన చేటు ఎంతో చెప్పడానికే ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో చోటుచేసుకున్న పలు పరిణామాలను అందులో ప్రస్తావించారు. ప్రజా వేదిక కూల్చివేత దగ్గర నుంచి డాక్టర్లు సుధాకర్, అనితారాణిపై దాడుల వరకు అన్నింటినీ విపులంగా పేర్కొన్నారు.
నవరత్నాలు కూడా 90 శాతం మోసమేనని చంద్రబాబు విమర్శించారు. రాళ్లు జనంపైకి విసిరి, రత్నాలు వైసీపీ నేతలు కొల్లగొట్టారని ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారుల్లో మూడింట రెండొంతుల మందికి ఆర్థిక సాయం ఎగ్గొట్టారని విమర్శలు చేశారు. బెదిరించి, ప్రలోభాలు పెట్టి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను లాక్కున్నారని ధ్వజమెత్తారు. ఎవరినైనా టీడీపీ నుంచి తీసుకుంటే తొలుత వారి చేత రాజీనామా చేస్తామన్న జగన్ ప్రకటన ఏమైందని ప్రశ్నించారు.
పొరపాటున ఫిరాయింపు జరిగితే అనర్హత వేస్తామన్నారని.. మరి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు ఎందుకు వేయలేదని నిలదీశారు. ఒక్క నాయకుడిని లొంగదీసుకుంటే వంద మందిని తయారుచేసే సత్తా టీడీపీకి ఉందని స్పష్టంచేశారు. ఏడాది కాలంలో దాదాపు 1600 కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
మొత్తానికి ఏడాది కాలంలో జరిగిన అన్ని విషయాలనూ చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పార్టీని వీడి వైసీపీలో చేరిన నేపథ్యంలోనే బాబు ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. వందల కోట్లు జరినామానాలు చెల్లించాలని బెదిరించి ఆయన్ను లొంగదీసుకున్నారని శిద్ధా పేరు ప్రస్తావించకుండా బాబు తన లేఖలో పేర్కొన్నారు. మరి బాబు లేఖ పార్టీ శ్రేణుల్లో ఎలాంటి ఉత్సాహం తెస్తుందో చూడాలి.
దేశమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలుచేస్తోంటే, ఏపీలో మాత్రం @ysjagan తన సొంత 'రాజారెడ్డి రాజ్యాంగం' అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. దేశ చరిత్రలోనే ఇంతటి రాక్షసపాలన, విధ్వంసకాండ ఏ ప్రభుత్వమూ చేయలేదు.(1/3) pic.twitter.com/EH1Qdq0I3J
— N Chandrababu Naidu (@ncbn) June 11, 2020