విపక్ష నేతలపై అధికార పార్టీ కుట్రపూరిత దాడులకు దిగుతోంటే, పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తోందన్నది టీడీపీ సహా ఇతర రాజకీయ పార్టీల ఆరోపణ. ఈ ఆరోపణల క్రమంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మరింత ఘాటుగా విమర్శిస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలపై కేసులు నమోదవడం, అర్థరాత్రి ఆయా వ్యక్తుల్ని అడ్డగోలుగా అరెస్టులు చేస్తుండడం.. వంటి అంశాలకు సంబంధించి విపక్షాలు విమర్శలు చేయడమే కాదు, న్యాయస్థానాలూ మొట్టికాయలేస్తున్నాయి పోలీసు వ్యవస్థపైన.
అధికార పార్టీ నేతలు ఎంతలా హద్దులు మీరుతున్నా పట్టించుకోని పోలీసు వ్యవస్థ, విపక్షాల విషయంలో మాత్రం అత్యుత్సాహం చూపుతున్నాయన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ. ఇక, ఇటీవల చిత్తూరు జిల్లాలో దళితులపై జరుగుతున్న వరుస ఘటనలపై చంద్రబాబు మండిపడుతున్నారు. పోలీసు వ్యవస్థను నిలదీస్తున్నారు. బహిరంగ లేఖలూ రాస్తున్నారు.
ఆ లేఖలపై స్పందించిన డీజీపీ, సీల్డ్ కవర్‌లో ఆధారాలు అందించాలనీ, బహిరంగ లేఖలు రాయవద్దని చంద్రబాబుకి సూచించిన విషయం విదితమే. డీజీపీ అలా వ్యాఖ్యానించడాన్ని తప్పు పట్టిన చంద్రబాబు, ‘దర్యాప్తు బాధ్యత పోలీసులదా.? ప్రతిపక్షానిదా.?’ అని ప్రశ్నించారు.
నిజమే.. ఈ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యల్ని తప్పుపట్టలేం. పోలీసు వ్యవస్థ వున్నదే.. ఆయా ఘటనలకు సంబంధించి నిజాలు నిగ్గు తేల్చడానికి. అధికార పార్టీ నేతలు ఆయా కేసుల్లో తప్పించుకుంటూ, పోలీసు వ్యవస్థకే సవాల్ విసురుతున్నారన్న విమర్శలున్నాయి. ఇక, పోలీసు వ్యవస్థపై అధికార పార్టీ పెత్తనానికి సంబంధించి చాలా ఆడియో టేపులూ బయటపడుతున్నాయి.
సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాలో ఓ సీఐ మీద దూషణలకు దిగితే.. అప్పుడెందుకు డీజీపీ స్పందించలేదు.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. దళితులపై పోలీసుల దాడులు పెరుగుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ, డీజీపీ విపక్షాలకు లేఖలు రాయడం మానేసి.. పోలీసు వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటూ టీడీపీ ఎద్దేవా చేస్తోంది.