ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

చంద్రబాబుకి ఇటు ఊరట, అటు మొట్టికాయ్‌.!

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఒకే రోజు రెండు భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. స్టేట్‌ సెక్యూరిటీ కమిషన్‌లో ప్రతిపక్ష నేత పేరు వుండాల్సిందేనంటూ నిన్న న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో స్టేట్‌ సెక్యూరిటీ కమిషన్‌లో ప్రతిపక్ష నేత పేరు వుండాలి గనుక, సంబంధిత జీవోని సవరించి.. చంద్రబాబు పేరుని చేర్చాలన్నది న్యాయస్థానం జారీ చేసిన ఆదేశం తాలూకు సారాంశం.

అయితే, సదరు జీవో చంద్రబాబు హయాంలోనే వచ్చింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా వున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మీద అసహనంతో అప్పటి ప్రభుత్వం, కొత్త జీవో తీసుకొచ్చి, స్టేట్‌ సెక్యూరిటీ కమిషన్‌ నుంచి ప్రతిపక్ష నేత పేరుని తప్పించింది. దానిపై అప్పట్లోనే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2018 నాటి జీవో అది. ‘వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మరో మొట్టికాయ.. చంద్రబాబు పేరుని స్టేట్‌ సెక్యూరిటీ కమిషన్‌లో చేర్చాలన్న హైకోర్టు..’ అంటూ టీడీపీ శ్రేణులు తొలుత బీభత్సమైన పండగ చేసుకున్నాయి.

కానీ, ఇక్కడ మొట్టికాయ పడింది ఒకప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి. అన్నట్టు, చంద్రబాబు తెచ్చిన జీవోని సవరించే అవకాశం వున్నా, ఆ జోలికి పోలేదు ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, కోర్టు ఆదేశాల నేపథ్యంలో చంద్రబాబు పేరుని, స్టేట్‌ సెక్యూరిటీ కమిషన్‌లో చేర్చేలా త్వరలో జీవో ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి.

చంద్రబాబు హయాంలోని జీవో కాకపోయి వుండి వుంటే.. టీడీపీ అనుకూల మీడియా ఈ వార్తకి స్పెషల్‌ ఫోకస్‌ ఇచ్చి వుండేవే. తప్పిదం చంద్రబాబు ప్రభుత్వానికి గనుక, ‘తేలు కుట్టిన డాష్‌ డాష్‌లా’ గమ్మునుండిపోయాయి టీడీపీ అనుకూల మీడియా సంస్థలు. వైసీపీ అనుకూల మీడియా షరామామూలుగానే, ‘చంద్రబాబు హయాంలో వచ్చిన జీవో.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ఝలక్‌..’ అంటూ కథనాలు షురూ చేసింది బ్లూ మీడియా. ఎవరి గోల వారిదే.!

Exit mobile version