ఆధునిక కాలంలో కూడా ఓ రాజకీయ నాయకుడు తపస్సుకు దిగాడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల పాలనానుభవం కలిగిన ఆ నాయకుడే నారా చంద్రబాబునాయుడు. ఎవరి పేరు చెబితే ఢిల్లీ పీఠాలు గజగజలాడుతాయని ఇన్నేళ్లుగా గొప్పలు చెప్పారో…ఇప్పుడా నాయకుడు ఢిల్లీ అభయ హస్తం కోసం నానాపాట్లు పడుతున్నాడు. సర్కస్ ఫీట్లు వేస్తున్నాడు. కోతి కొమ్మచ్చి ఆడుతున్నాడు.
అది, ఇది అని కాదు…ప్రధాని మోడీ చల్లని చూపు కోసం ఏం చేయడానికైనా ఆయన వెనకాడటం లేదు. ఏడాది క్రితం ‘ఏయ్ మోడీ…నీ అంతు తేలుస్తా. నిన్ను ఢిల్లీ పీఠం నుంచి గద్దె దింపేందుకు అవసరమైతే రాహుల్ అస్త్రాన్ని, మమత బాణాన్ని…చివరికి పాశుపతాస్త్రం లాగా నారా అస్త్రాన్ని విడుస్తా’ అని బీరాలు పలికిన బాబు…సార్వత్రిక ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డాడు. అందితే కాళ్లు, అందకపోతే జుట్టు అనే రీతిలో రాజకీయాలు నడిపే చాణక్యం బాబు సొంతం.
ఇటు రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడంతో పాటు కేంద్రంలో తిరిగి మోడీ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో తత్వం బోధపడి…శరణు తప్ప మరో మార్గం లేదని బాబు ఓ నిర్ణయానికి వచ్చాడు. మోడీపై ప్రశంసలకు తప్ప విమర్శలకు నోరు తెరిస్తే ఒట్టు. నోటిని అదుపులో పెట్టుకోవడం అంటే ఏంటో మోడీ విషయంలో బాబు పాటిస్తున్న క్రమశిక్షణే నిదర్శనం.
ఒకవైపు జగన్ సర్కార్ కొరడా ఝుళిపిస్తుండటంతో ప్రధాని మోడీ అభయ హస్తం కోసం చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేస్తున్నాడు. కానీ, మోడీ-అమిత్‌షా ద్వయం మాత్రం…‘పోపోవయ్యా, చూశాం కానీ నీ నక్క వినయాలు’ అంటూ పట్టించుకోవడం లేదు. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా బాబు ప్రధాని మోడీ ప్రసన్నకోసం యజ్ఞం చేస్తూనే ఉన్నాడు. కరోనాపై సలహాలిస్తానంటూ ప్రధాని కార్యాలయానికి మొర్ర పెట్టుకుంటే…పోనీలే అని మోడీ దయతో ఫోన్ చేశాడు. ఈ మాత్రం దానికే బాబు చిన్న పిల్లోడి మాదిరిగా సంబరపడటం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది.
ప్రధాని, రాష్ట్రపతులను తయారు చేశానని చెప్పుకునే ఈ పెద్ద మనిషేనా…మోడీ నుంచి ఫోన్ వస్తే ఇంతగా గంతులేస్తున్నాడనే ఆశ్చర్యపోతున్న వాళ్లు లేకపోలేదు. నిన్నటికి నిన్న పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీపై బాబు ప్రశంసలు కురిపించాడు.
‘ప్రధాని మోదీ కరోనాను ఎదుర్కొనేందుకు, భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళిక విషయంలో అన్ని వర్గాలతో మాట్లాడి…దూరదృష్టితో వ్యవహరిస్తున్నారు. ప్రధాని నుంచి కొంచెం స్ఫూర్తిని కూడా జగన్మోహన్‌రెడ్డి తీసుకోవడం లేదు’ అని పనిలో పనిగా సీఎంపై విమర్శలు, ప్రధానిపై ప్రశంసలు కురిపించాడు. ఇక్కడో చిన్న విషయం. ప్రస్తుతం తాను ఉంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. కానీ ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధానిని నెత్తిన మోయడానికి సిద్ధమైన బాబును చూస్తే జాలేస్తుంది. బాబు తపస్సుకు వరమిచ్చేంత అమాయకుడా మోడీ? ఇప్పుడిదే ప్రధాన ప్రశ్న.