అమరావతిని అద్భుతంగా కాకపోయినా, ఐదేళ్ళలో ఓ మోస్తరుగా అయినా చంద్రబాబు నిర్మించి వుంటే, ఇప్పుడు అమరావతికి ఈ దుస్థితి వచ్చేది కాదు.. చంద్రబాబుకీ ఈ దుస్థితి వచ్చేది కాదు. ఏకంగా రాజధానిలోనే చంద్రబాబు పుత్రరత్నాన్ని ఓటర్లు ఓడగొట్టారంటే, దానర్థమేంటి.? వైసీపీ చేతిలో టీడీపీ ఓడిపోయింది. ఇదీ వాస్తవం. ప్రజలు టీడీపీని ఓడగొట్టారు.. ఇదీ నిజం.
వాస్తవాల్నీ, నిజాల్నీ చంద్రబాబు జీర్ణించుకోలేరు. ఈ క్రమంలో ఆయన అసహనానికి గురవుతారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వరకూ ప్రతిపక్ష నేత బాధ్యతే. కానీ, నోరు పారేసుకుంటే అది ఆ నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. చంద్రబాబుకి తెలుసు.. తాను ప్రభుత్వాన్ని తిడితే, అట్నుంచి.. తిట్ల వర్షం దూసుకొస్తుందని.
మంత్రి కొడాలి నాని వీరంగమాడేశారు. బూతులు తిట్టేశారు.. ఎందుకిదంతా.? మళ్ళీ సింపతీ గేమ్ అనుకోవాలేమో. చంద్రబాబు సరే.. కొడాలి నాని సంగతేంటి.? తానొక మంత్రినన్న విజ్ఞతను ఆయన కోల్పోతే ఎలా.? సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నారు కొడాలి నాని.? ఇంతకీ, ఈ మొత్తం ఎపిసోడ్‌లో మీడియా పాత్ర ఏంటి.? రాజకీయ నాయకుల్ని ‘బూతుల చక్రవర్తుల్లా’ మీడియా చూపించాలనుకుంటోందా.? మీడియా మైకులు చూస్తే పూనకంతో ఊగిపోతున్న నాయకుల వ్యవహారాల్ని సెన్సార్ చేసేస్తే.. ఆ రాజకీయ నాయకుల నోళ్ళకు ఆటోమేటిక్‌గా తాళాలు పడిపోతాయి కదా.!
కరోనా వేళ అమరావతిలో వుండాల్సిన చంద్రబాబు, హైద్రాబాద్‌కి చెక్కేశారు. అమరావతిలో గెలిచిన వైసీపీ, ఆ అమరావతి రైతుల ఆవేదనను అర్థం చేసుకోవడంలేదు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.. తిట్టుకుంటున్నారు. నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. చూస్తోంటే, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్‌లానే అనిపిస్తోంది.
60-40 ఒప్పందాలు వైసీపీ – టీడీపీ మధ్యన లేకపోతే, లక్ష కోట్ల అవినీతి అమరావతిలో జరిగిందని ఆరోపిస్తోన్న వైసీపీ, 18 నెలల పాలనలో చంద్రబాబు అండ్ టీమ్‌ని ఎందుకు జైలుకు పంపలేకపోయింది.? 40 ఏళ్ళ అనుభవం లేదు.. యువ రక్తం లేదు.. అందరూ చేసేది ఒకటే. మంత్రి, ప్రతిపక్ష నేత… ఇలా ప్రతి ఒక్కరూ తమ స్థాయిని దిగజార్చేసుకుని మాట్లాడుతోంటే, వీళ్ళా మన నాయకులు.? అని జనం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది.