క్రిస్టియన్, మైనార్టీ, దళిత ఓటు బ్యాంకు టీడీపీకి ఏ స్థాయిలో దూరమైపోయిందో యనమల – సోమిరెడ్డి మధ్య జరిగిన చర్చ చూస్తే అర్థమవుతుంది. ఈ విషయమై చంద్రబాబు కూడా తనకు తోచిన నాలుగు మాటలు చెప్పారు. ఇంతలో కల్పించుకున్న వర్ల రామయ్య, ఈ అంశాలపై ఇలాంటి చర్చ తప్పుడు సంకేతాలను పంపుతుందని వారించడంతో, అక్కడితో ఆ చర్చ ముగిసినట్లు కనిపిస్తోంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా కులాల పేరుతో, మతాల పేరుతోనే ఓటు బ్యాంకు రాజకీయాలు జరుగుతున్నాయి. దేశంలో ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా వున్నా, ఏపీలో ఈ కులాల పంచాయితీ, మతాల రగడ చాలా ఎక్కువగా కనిపిస్తోంది.. రాజకీయ పార్టీలు అలా జనాన్ని విడదీసేందుకు, తద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.
వైసీపీ హయాంలో, కొన్ని సామాజిక వర్గాల్ని విజయవంతంగా టీడీపీకి దూరం చేయగలిగినమాట వాస్తవం. ఆ లోటు టీడీపీకి బాగా తెలిసొస్తోంది. నిజానికి, 2014 తర్వాత టీడీపీ కూడా అదే పని చేసింది. కానీ, 2019 ఎన్నికల నాటికి టీడీపీ పూర్తిగా దెబ్బతినేసింది. అన్ని కులాలు, అన్ని మతాల గురించి జనసేన మాట్లాడితే, అందులో కొంత భాగాన్ని తీసుకుని, జనసేన మీద ‘కాపు’ ముద్ర వేయడం, అలాగే కాపు నేతలతో జనసేన అధినేతను తిట్టించడం.. ఈ తరహా రాజకీయాలు ఏపీలో నడుస్తున్న విషయం విదితమే. మరి, టీడీపీ, వైసీపీ చేస్తున్న నీతిమాలిన రాజకీయాల్ని ప్రశ్నించేదెవరు.?
Share