కెరీర్ ఆరంభంలో.. నటుడిగా బిజీ అయిన సమయంలో ఏడాదికి రెండు..మూడు సినిమాలు చేసి రిలీజ్ చేసేవారు. ఆ తర్వాత ఏడాదికి ఒక్కో సినిమానే చేసుకుంటూ వచ్చారు. అయితే మెగాస్టార్ మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత కంబ్యాక్ అవ్వడం వెనుక చాలా ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. కంబ్యాక్ వెంటనే కూల్ గా ఒక్కో సినిమా చొప్పున చేసుకుంటూ వచ్చిన బాస్ ఇప్పుడు ఈ ఏడాది ఒకేసారి ఏకంగా మూడు..నాలుగు చిత్రాల్ని ప్లాన్ చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. మెగాస్టార్ 70 ఏళ్లు నిండకముందే కనీసం 15-20 పైగా సినిమాలు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారుట.
అందుకోసం సరైన కథల్ని సిద్దం చేయిస్తున్నట్లు సమాచారం. దర్శకుడు తనికి కథ వినిపించడానికి వచ్చినప్పుడు లైన్ నచ్చితే.. స్క్రిప్ట్ డెవలెప్ చేయమని ఆఫర్ చేస్తున్నారుట. ముందు కథ లాక్ చేసుకున్న తర్వాత ఇతర విషయాలు చూడాలని పక్కా ప్లాన్ తో ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. చిరు వయసు ఇప్పుడు 66 ఏళ్లు. అంటే నాలుగేళ్లలోనే ఇన్ని సినిమాలు చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఏడాదికి ఐదు సినిమాలు చేస్తేనే గాని చిరు అనుకున్నది జరగదు. అందుకేనేమో మెగాస్టార్ వరుసగా ప్రాజెక్ట్ ల్ని తెరపైకి తీసుకొస్తున్నారు. గతంలో ఇదే తరహాలో ఏడాదికి ఐదారు సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ చేసేవారు. రోజుకు మూడు షిఫ్టులు పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఎన్టీఆర్.. ఏఎన్నార్ లాంటి లెజెండరీల రికార్డులనే ఆ రకంగా సూపర్ స్టార్ బ్రేక్ చేసారు. ఇప్పుడు సూపర్ స్టార్ రికార్డుని బ్రేక్ చేయడానికి మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నారా? అన్న సందేహం కలగక మానదు.
బిగ్ బి కూడా మెగాస్టార్ కి స్ఫూర్తి
మరోవైపు బాలీవుడ్ లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 78 ఏజ్ లోనూ ఇంతకుమించి స్పీడ్ గా సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. బహుశా తన స్నేహితుడు సీనియర్ బచ్చన్ స్ఫూర్తితోనే మెగాస్టార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా అభిమానులు భావిస్తున్నారు. అమితాబ్ ఓ వైపు కౌన్ బనేగా కరోడ్ పతి అన్ని సీజన్లకు హోస్ట్ గా కొనసాగుతూ భారీ ఆదాయం ఆర్జిస్తున్నారు. అలాగే బాలీవుడ్ టాలీవుడ్ లో వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రభాస్ – నాగ్ అశ్విన్ పాన్ ఇండియా చిత్రంలోనూ అమితాబ్ నటిస్తున్నారు. అలాంటి లెజెండ్ స్ఫూర్తితో మెగాస్టార్ కూడా ఎనర్జిటిక్ గా దూసుకెళుతున్నారని అభిమానులు భావిస్తున్నారు.