ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సీఎంతో భేటీకి చిరంజీవి వెంట ఎవరెవరు..?

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డితో సమావేశమై ఇండస్ట్రీ సమస్యలను వివరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి సీఎంతో భేటీ కాబోతున్నారు. ఫిబ్రవరి 10న అపాయింట్మెంట్ ఖరారు అయింది. అయితే రేపు జరగబోయే మీటింగ్ కు ఈసారి చిరుతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

సీఎంతో సమావేశానికి చిరంజీవి – నాగార్జునలతో పాటు ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య – యువి క్రియేషన్స్ వంశీకృష్ణ – ఆర్.నారాయణ మూర్తి – రాజమౌళి – త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పలువురు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే మహేష్ బాబు – ఎన్టీఆర్ – ప్రభాస్ వంటి హీరోలు కూడా చిరు వెంట నడుస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కానీ వీరంతా జగన్ తో భేటీకి వెళ్లడం లేదని.. కాకపోతే చిరుకి మద్దతు తెలుపుతూ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని కోరినట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నారు. ఏపీ సీఎంని ఎవరెవరు కలవబోతున్నారనేది పక్కన పెడితే.. రేపు జరగబోయే సమావేశం తర్వాత దాదాపు సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా టాలీవుడ్ భావిస్తోంది. టిక్కెట్ రెట్లు పెంపు – బెనిఫిట్ షోలు – ఐదవ షోకు అనుమతిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

అలానే భారీ బడ్జెట్ సినిమాలకు రెండు వారాలు టిక్కెట్ రెట్లు పెంచుకోవడం – కరెంట్ చార్జీలు – స్టేట్ ట్యాక్స్ తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీలు – మండలాలు – నగరాలు వంటి ప్రాంతాల వారీగా కాకుండా మల్టీప్లెక్స్లు – ఏసీ థియేటర్లు – నాన్ ఏసీ థియేటర్లు అనే మూడు కేటగిరీల్లో టిక్కెట్ ధరలను నిర్ణయించాలని జగన్ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ వర్గాలు ప్రతిపాదించాయని సమాచారం.

ఏసీ థియేటర్ కి గరిష్ట టిక్కెట్ ధర రూ.125తో పాటు జీఎస్టీ.. నాన్-ఏసీ థియేటర్లకు రూ.70 ప్లస్ జీఎస్టీ చెల్లించాలని టాలీవుడ్ అభ్యర్థించారట. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నంది పురష్కారాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవాకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే సినిమా టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక రెడీ అయింది. నిన్న మంగళవారం మంత్రి పేర్ని నాని కమిటీ రిపోర్టును ముఖ్యమంత్రికి అందజేశారు.

సీఎం జగన్ తో సినిమా టికెట్ల ధరలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి పేర్నినాని.. ఇవాళ మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారని సమాచారం. గతంలో టికెట్ ధరల విషయంలో తెచ్చిన జీవోని సవరించడానికి ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోకి సైతం అనుమతులతో పాటు.. బీ సీ సెంటర్లలో ఉన్న టికెట్ ధరలను సవరించనున్నారని సమాచారం. భారీ బడ్జెట్ సినిమాలకు రెండు వారాలు టిక్కెట్ ధరలు 20 శాతం పెంచుకొనే విధంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

Exit mobile version