సోషల్ మీడియాకు వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు చిరంజీవి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. మరీ ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు, అంశాల జోలికి అస్సలు వెళ్లడం లేదు. కేవలం తన స్వగతాన్ని పంచుకునేందుకు, మంచిని ప్రోత్సహించేందుకు మాత్రమే సోషల్ మీడియాను వాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు కూల్ వింటేజ్ ఫొటోలు పెడుతూ అందర్నీ తనవైపు తిప్పుకుంటున్నారు.
మొన్నటికిమొన్న చరణ్ పుట్టినరోజు సందర్భంగా అతడి చిన్నప్పటి ఫొటోల్ని షేర్ చేశారు చిరంజీవి. ఇప్పుడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బన్నీకి సంబంధించిన చిన్నప్పట్ని ఫొటోల్ని బయటపెట్టారు. వీటితో పాటు గతంలో దర్శకుడు బాపు తనకు బహుమతిగా అందజేసిన ఆంజనేయ స్వామి ఫొటో విశేషాల్ని నెజిటన్లతో పంచుకున్నారు. ఏప్రిల్ 8తో తనకు చాలా అనుబంధం ఉందంటూ దశలవారీగా ఆ విశేషాల్ని బయటపెడుతున్నారు.
వీటికితోడు మధ్యమధ్యలో మోహన్ బాబుతో చిలిపి ఛాటింగ్ లు, పూరి జగన్నాధ్ ను ఆటపట్టించిన విధానం అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇలా తన మనసులో భావాలు పంచుకుంటూనే మరోవైపు తన నేతృత్వంలో నడుస్తున్న సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ)కి సంబంధించి అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఛారిటీకి సహాయం చేసిన స్టార్స్, నిర్మాతలు, దర్శకులు అందరికీ పేరుపేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నారు.
లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా సోషల్ మీడియాలో అదరగొడుతున్నారు చిరంజీవి. వివాదాలకు దూరంగా ఉంటూ అందరివాడు అనిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. చిరంజీవి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఇలానే ఉండాలని, రాజకీయాల్ని అస్సలు ప్రస్తావించకూడదని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. మనం కూడా అదే కోరుకుందాం.